ఇతర పార్టీలతో పోలిస్తే అంతర్గత ప్రజాస్వామ్యం కాస్త ఎక్కువగా వుండే కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు, అసమ్మతులు వెరీ కామన్. దశాబ్ధాలుగా ఈ ధోరణి కాంగ్రెస్ పార్టీలో తరచూ బహిర్గతమవుతూనే వుంది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి అదే పరిస్థితి ఏర్పడింది. కొత్తగా టీపీసీసీ కమిటీలతోపాటు రాజకీయ వ్యవహరాల కమిటీని కాంగ్రెస్ జాతీయనాయకత్వం వెల్లడించడంతో మరోసారి పార్టీలో అసంతృప్తి భగ్గుమన్నది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్కం ఠాగూర్ ఏకపక్షంగా కమిటీలపై నిర్ణయం తీసుకున్నారని పలువురు పార్టీ సీనియర్లు బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. ఆఖరుకు సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్కను కూడా కమిటీల ఎంపికలో భాగస్వామిని చేయకపోవడం విడ్డూరంగా వుందని గాంధీభవన్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. తాజాగా సీఎల్పీ నేత భట్టి స్వయంగా ఇదే అభిప్రాయాన్ని బహిర్గత పరిచారు.
డిసెంబర్ 10వ తేదీన టీపీసీసీ కమిటీల ప్రకటన వెలువడింది. అందరినీ సంతృప్తి పరిచే కసరత్తు పేరిట రేవంత్ రెడ్డి, మాణిక్కం ఠాగూర్ సుదీర్ఘ మంతనాలు జరిపిన తర్వాత జంబో కమిటీలను ప్రకటించారు. 24 మంది ఉపాధ్యక్షులు, 84 మంది ప్రధాన కార్యదర్శులు, 40 మంది ఎగ్జిక్యూటివ్ సభ్యులతో టీపీసీసీ కమిటీని వెల్లడించారు. దాంతోపాటు 18 మంది సభ్యులు, నలుగురు ప్రత్యేక ఆహ్వానితులతో కలిపి రాజకీయ వ్యవహారాల కమిటీని కూడా నియమించారు. ఇందులో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డికి ఎందులోను అవకాశం దక్కకపోవడం చర్చనీయాంశమైంది. కమిటీలను మర్నాడే అంటే డిసెంబర్ 11నే మాజీ మంత్రి కొండా సురేఖ తన అసంతృప్తిని వెళ్ళగక్కారు. నేరుగా రేవంత్ రెడ్డిని కలిసి తన ఫీలింగ్ పంచుకున్నారు. అయితే ఆయన నోటి మాటగా ఇచ్చిన హామీతో ఆమె కాస్త నెమ్మదించినట్లు కనిపిస్తున్నారు. పెద్ద సంఖ్యలో నేతలకు అవకాశం కల్పిస్తూ టీపీసీసీకి జంబో కమిటీలను ఏర్పాటు చేశారు. అందరికి అవకాశం కల్పించడం పేరిట జంబో కమిటీలకు తెరలేపారు. అయినా చిరకాలంగా పని చేస్తున్న వారికి అవకాశం దక్కలేదన్న అసంతృప్తి భగ్గుమన్నది. తమకు సముచిత స్థానం దక్కలేదని పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సీఎల్పీ లీడర్ అయిన తనను కూడా సంప్రదించలేదని మల్లు భట్టి విక్రమార్క అంటున్నారు.
కాగా ఉమ్మడి మెదక్ జిల్లా నేతలకు పదవుల పంపకం సరిగ్గా జరగలేదని మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ ఆగ్రహంతో వున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏర్పాటైన జిల్లాలకు డీసీసీ అధ్యక్షుల ఎంపికపై రాజనర్సింహ అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారు. సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని నియమించకపోవడం, సిద్దిపేట, మెదక్ జిల్లాల డీసీసీ అధ్యక్షులను కొనసాగించడం వంటి అంశాలు రాజనర్సింహ ఆగ్రహానికి కారణమైనట్లు సమాచారం. ఈ విషయంపై తేల్చుకునేందుకు రాజనర్సింహ డిసెంబర్ 12న గాంధీభవన్‌కు వచ్చారు. రేవంత్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో మీడియా ముందు బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేసేందుకు సంసిద్దమయ్యారు. కానీ, అక్కడే వున్న పలువురు సీనియర్ నేతలు మీడియాకు ఎక్కవద్దంటూ ఆయనకు సూచించడంతో మౌనంగా వుండిపోయినట్లు సమాచారం. ఆ తర్వాత తన నివాసంలో దామోదర రాజనర్సింహ పలువురితో మంతనాలు జరుపుతున్నారు. మళ్ళీ డిసెంబర్ 13న ఆయన పార్టీ అధినాయకత్వానికి సలహాల పేరిట మీడియా ముందుకొచ్చారు. సలహాలంటూనే చురకలంటించారు. పార్టీ కోసం పని చేసే దళితులకు గుర్తింపు లభించడం లేదని, సిద్దిపేట వంటి జిల్లాల్లో కోవర్టులకు పెద్దపీట వేశారని రాజనర్సింహ కామెంట్ చేశారు. చిరకాలంగా పార్టీలో పని చేస్తున్న వారికి కాకుండా రెండు, మూడు నెలల క్రితం పార్టీలో చేరిన వారికి పదవులు కట్టబెట్టారని రాజనర్సింహ ఆవేదన వ్యక్తం చేశారు.
కొత్తగా ఏర్పాటైన రాజకీయ వ్యవహారాల కమిటీ సీనియర్ నేతల్లో అసంతృప్తికి కారణం కాగా, ఎగ్జిక్యూటివ్ కమిటీ, 26 జిల్లాలకు డీసీసీ అధ్యక్షుల నియామకం ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఆగ్రహానికి కారణమయ్యాయి. కమిటీల ప్రకటన వెలువడిన మర్నాడే కొండా సురేఖ తన పదవికి రాజీనామా చేస్తూ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రెండోరోజు అంటే డిసెంబర్ 12న మరికొందరు సీనియర్ నేతలు నిరసన గళమందుకున్నారు. వీరిలో సీనియర్ నేత వి.హనుమంతరావు, జే.గీతారెడ్డి, కోదండరెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మహేశ్వర్ రెడ్డి వున్నారు. మరోవైపు ఓయు క్యాంపస్‌లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పని పలువురు విద్యార్థి నేతలు తమ కష్టాన్ని గుర్తించడం లేదంటూ నిరసన చేపట్టారు. రాష్ట్ర అధికార ప్రతినిధిగా వున్న ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు బెల్లయ్య నాయక్ తన పదవికి రాజీనామా చేశారు. పార్టీలో అసంతృప్తి ఒక్కసారి భగ్గుమనడంతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా నోరు విప్పాల్సి వచ్చింది. కమిటీల ఎంపికలో తన ప్రమేయం లేదని ఆయన క్లారిఫికేషన్ ఇచ్చుకున్నారు. కమిటీల ఎంపికలో సీఎల్పీ నేత అయిన తనను భాగస్వామిని చేయకపోవడం ఆశ్చర్యం కలిగించిందని భట్టి మీడియా ముందు వ్యాఖ్యానించారు. కమిటీల ఎంపికలో పీసీసీ అధ్యక్షుడు ఎంత ఇంపార్టెంటో.. సీఎల్పీ లీడర్ కూడా అంతే ఇంపార్టెంట్ అని భట్టి అంటున్నారు. తనను కలిసిన వారి ఆవేదన వింటున్న భట్టి.. ఈ అంశాలను పార్టీ హైకమాండ్‌కు చేరవేస్తానని చెబుతున్నారు.
నిజానికి పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్కం ఠాగూర్‌పై అసంతృప్తి వుంది. పార్టీని వీడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి లాంటి వారితోపాటు పార్టీలోనే వున్న విహెచ్ లాంటి వారు మాణిక్కం వ్యవహార శైలి బాగాలేదని బహిరంగంగానే అన్నారు. ఈక్రమంలో తాజా ప్రకంపనలను హైకమాండ్ ఎలా తీసుకుంటుందన్నది ఇపుడు ఆసక్తి రేపుతోంది. మరో పది నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి దృష్టిలో పెట్టుకునే టీపీసీసీ కమిటీలను ప్రకటించినా.. అది కాస్త వికటించిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ అసంతృప్తి మరింతగా రాజుకోక ముందే హైకమాండ్ అప్రమత్తం కావాలని లేకుంటే ఇది మరికొంత కాలం కొనసాగితే దాని ప్రభావం కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను కచ్చితంగా దెబ్బ కొడుతుందని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. త్వరలో అధిష్టానాన్ని కలుస్తానన్న భట్టి ప్రయత్నాలు ఏమేరకు సఫలమవుతాయో, కమిటీల ఏర్పాటులో జరిగిన లోటుపాట్లను ఎలా సరిదిద్దుతారో అన్న అంశాలపై గాంధీభవన్ వర్గాలు రకరకాలుగా చర్చించుకోవడం కొసమెరుపు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..