AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వివాదం తర్వాత సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసేందుకు మంత్రి కొండా సురేఖ అపాయింట్‌మెంట్..!

మంత్రి కొండా సురేఖ కుమార్తె వ్యాఖ్యలతో తలెత్తిన వివాదంపై టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసి రాఖీ కట్టేందుకు సురేఖ అపాయింట్‌మెంట్ కోరారు. ఇది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాంగ్రెస్ అధిష్ఠానం ఆమెపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది.

వివాదం తర్వాత సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసేందుకు మంత్రి కొండా సురేఖ అపాయింట్‌మెంట్..!
Konda Surekha Rakhi Request To Cm Revanth Reddy
Balaraju Goud
|

Updated on: Aug 28, 2026 | 9:15 AM

Share

తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల చోటుచేసుకున్న వివాదం తర్వాత మీడియాకు దూరంగా ఉన్న మంత్రి.. తాజాగా రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ వీడియో విడుదల చేశారు. తన సోషల్ మీడియా ఖాతాల్లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. పండుగ వేళ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అపాయింట్‌మెంట్‌ కోరిన కొండా సురేఖ.. రాఖీ కట్టేందుకు సమయం కావాలన్నారు. దీంతో సీఎం రేవంత్‌ను కలుస్తారా? లేదన్నదీ ఆసక్తికరంగా మారింది.

ఇటీవల కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్‌లో అంతర్గత వివాదం తీవ్రరూపం దాల్చింది. ఆ వ్యవహారంపై ఆగస్టు 20న టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. అనంతరం ఆమె తనకు కుమార్తె వ్యాఖ్యలతో సంబంధం లేదని వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతల నుంచి సైతం చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపించాయి. ఆగస్టు 25న టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని సిఫారసు చేసినట్లు పలు కథనాలు వెల్లడించాయి. అయితే పూర్తి విచారణ అనంతరం నివేదికను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఏఐసీసీకి పంపించినట్లు సమాచారం. తుది నిర్ణయం అధిష్ఠానం తీసుకోవాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో ‘గీత దాటితే చర్యలు తప్పవు’ అన్న సంకేతాలు ఇప్పటికే పార్టీ నాయకత్వం నుంచి వస్తున్నాయని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రస్థాయి విచారణ పూర్తై వ్యవహారం ఇప్పుడు ఏఐసీసీ పరిధిలోకి వెళ్లిందని టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్ కుమార్ గౌడ్ కూడా స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా.. రాఖీ పౌర్ణమి సందర్భంగా కొండా సురేఖ విడుదల చేసిన తాజా వీడియోలో మాత్రం రాజకీయ వివాదంపై ఎలాంటి ప్రస్తావన చేయకుండా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టేందుకు అపాయింట్‌మెంట్ కోరారు కొండా సురేఖ. తాజా పరిణామాల నేపథ్యంలో సీఎం రేవంత్‌కు కొండా సురేఖ రాఖీ కడతారా? అనే అంశంపై కూడా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు, కొండా సురేఖపై కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరుతారా? ఆమె నిరాకరిస్తే అధిష్ఠానం తదుపరి చర్యలకు వెళ్తుందా? అన్న ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. అయితే రాఖీ శుభాకాంక్షల వీడియోతో సురేఖ మళ్లీ ప్రజల ముందుకు రావడం మాత్రం తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసింది.

కొండా సురేఖ వీడియో సందేశం ఇక్కడ చూడండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us