Telangana Congress Party: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి పాల్వాయి హరీష్‌ను బహిష్కరించారు. ఆ మేరకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కోదండరెడ్డి ప్రకటన విడుదల చేశారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు గానూ హరీష్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, 2018లో సిర్పూర్ ఖాగజ్‌నగర్ ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి హరీష్ పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత కొంతకాలం పార్టీ కార్యక్రమాల్లో అడపాదడపా పాల్గొంటున్నా.. ఆ తరువాత క్రమంగా పార్టీకి దూరమవుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని, తన అనుచరులతోనూ పార్టీ వీడటంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ హరీష్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇదిలాఉంటే.. మంగళవారం నాడు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. తొలుత హైదరాబాద్‌కు రానున్న తరుణ్ చుగ్.. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో మధ్యాహ్నం 12 గంటలకు కాగజ్ నగర్‌కు చేరుకుంటారు. కాగజ్ నగర్ పేపర్ మిల్ గ్రౌండ్‌లో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభలో తరుణ్ చుగ్ సహా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ రాష్ట్ర అగ్ర నేతలు పాల్గొంటున్నారు. ఇక ఇదే సభలో తరుణ్ చుగ్ సమక్షంలోనే పాల్వాయ్ హరీష్ బాబు బీజేపీ కండువా కప్పుకోనున్నారని సమాచారం.
Also read:
యాక్షన్ ఎంటర్టైనర్ గా ‘మహాసముద్రం’.. స్టోరీ లైన్ ఇదే అంటున్నారే..
టెలికం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్..