Telangana: తెలంగాణ కాంగ్రెస్‌లో అసంతృప్తులు, రాజీనామాలు. పార్టీ రాష్ట్ర నాయకత్వంపైనే తిరుగుబాటు. సరిగ్గా ఇదే సమయంలో మునుగోడు పరీక్ష. ఇవన్నీ పార్టీ ఇన్‌ఛార్జి మాణిక్యం ఠాగూర్‌కు సవాల్‌గా మారాయి. మరి ఈ పరీక్షలో ఆయన నెగ్గుతారా? ఇబ్బందిని తెచ్చిపెట్టుకుంటారా? సిట్టింగ్ సీటు మునుగోడు కాంగ్రెస్‌కు ఎంత ఇంపార్టెంటో మాణిక్యం ఠాగూర్‌కి అంతకన్నా ముఖ్యం. పార్టీ కన్నా ఆయనకే ఇదో అగ్ని పరీక్ష. ఎందుకంటే ఆయన ఇన్‌ఛార్జిగా వచ్చాక ఒక్క ఎన్నికలో గెలవలేదు సరికదా కనీస పెర్ఫార్మెన్స్ చూపించలేదు.
వరుస సమీక్షలు..
కాబట్టే మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్ ఇన్‌ఛార్జి మాణిక్యం ఠాగూర్‌కి టెన్షన్ పెడుతోందనే ప్రచారం నడుస్తోంది. ఈ ఎన్నికల్లో ఏ ఇబ్బంది వచ్చినా ఆయన పదవికి గండం తప్పదనే టాక్ ఉంది. అందుకే ఠాగూర్ కూడా దీన్ని కొంచెం సీరియస్‌గానే తీసుకున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే రెండుసార్లు హైదరాబాద్‌కు వచ్చారు ఠాగూర్. నేతలతో సమీక్షలు జరిపారు. ఇక ఉప ఎన్నిక కోసం వ్యూహాలు పన్నుతున్నా సక్సెస్ కాకపోవడం ఠాగూర్‌లో టెన్షన్‌ను పెంచేస్తోందని తెలుస్తోంది. సొంత పార్టీ నేతలే ఆయన్ను టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేస్తుండటం, అధిష్టానానికి ఫిర్యాదులు వెళుతుండటం ఇన్‌ఛార్జికి మరింత తలనొప్పిగా మారాయి.
మునుగోడు కోసం కమిటీ..
మునుగోడు కోసం ఏఐసీసీ ఇప్పటికే ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ గ్రౌండ్‌లో వర్క్ చేస్తున్నా పెద్దగా ప్రయోజనం లేదని పార్టీలోనే చర్చ జరుగుతోంది. మండలాల వారీగా ఇన్‌ఛార్జులు పూర్తి స్థాయిలో పని చేయడం లేదని ఏకంగా మాణిక్యం ఠాగూర్ అసంతృప్తి ఉన్నారని తెలుస్తోంది. ఆజాదీ కా గౌరవ్ పేరుతో పాదయాత్ర పెడితే సీనియర్లు ఎవరూ పాల్గొనకపోవడం కూడా పార్టీలో ఐక్యతను స్పష్టం చేస్తోంది. ఇంత జరుగుతున్నా ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో ఇంత వరకు మాణిక్యం ఠాగూర్ మాట్లాడలేదనే అసంతృప్తి కొందరిలో ఉంది. ఠాగూర్ వన్‌సైడ్‌గా పీసీసీ చీఫ్‌కు అనుకూలంగా రిపోర్ట్స్ ఇస్తున్నారని సీనియర్లు బహిరంగంగా విమర్శిస్తున్నారు. మర్రి వ్యాఖ్యలపై ఘాటుగానే రియాక్ట్ అయ్యారు పార్టీ ఇన్‌ఛార్జి. బీజేపీలోకి వెళ్లాలనుకునే వారు చేసే ఆరోపణలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
తలనొప్పిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇష్యూ..
మరోవైపు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇష్యూ కూడా ఠాగూర్‌కు తలనొప్పిగా మారింది. ఆయన విషయంలో చాలా ఆలస్యంగా రియాక్ట్ అయ్యారనే టాక్ పార్టీలో ఉంది. మునుగోడు అంశంపై ఠాగూర్ తనతో కనీసం మాట్లాడలేదన్న ఆగ్రహం వెంకట్‌రెడ్డిలో ఉంది. దీనిపై మీడియా ప్రశ్నిస్తే వెంకట్‌రెడ్డి తనకు మంచి మిత్రుడేనని చెప్పుకొచ్చారు మాణిక్యం ఠాగూర్.
గతంలో ఇలాంటి ఇష్యూల్ని డీల్ చేయడంలో ఠాగూర్ విఫలమయ్యారనే చర్చ ఉంది. చివరకు రాహుల్‌గాంధీ వరకు వెళ్లాయి. ఒకవైపు మునుగోడు అగ్ని పరీక్షను ఎదుర్కొంటూ, వెంకట్‌రెడ్డి ఇష్యూని ఠాగూర్ ఎలా హ్యాండిల్ చేస్తారోననే అనుమానం ఉంది. ఈ పరిణామాలన్నీ ఆయనకు పెద్ద సవాలేనని తెలుస్తోంది. గత ఫలితాలే వస్తే ఇన్‌ఛార్జి పోస్టుకు గండం తప్పదని ప్రచారం జరుగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..