కొత్తతరహా మోసం.. ఏకంగా సీఎం రిలీఫ్ ఫండ్‌నే కాజేశారు.. ఎలానో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

తెలంగాణలో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) డబ్బుల గోల్ మాల్ అయ్యాయి. సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులు భారీగా దారి మళ్ళాయి. గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ నగదు కోసం నకిలీ రోగులను సృష్టించి, తప్పుడు బిల్లులు పెట్టి పెద్ద మొత్తంలో నగదు స్వాహా చేశారు. కానీ ఈసారి అక్రమార్కులు కొత్త తరహాలో సీఎం రిలీఫ్ ఫండ్ మింగేసారు. అసలు ఇంతకు ఈ కొత్త తరహా మోసం ఏంటో తెలుసుకుందా పదండి.

కొత్తతరహా మోసం.. ఏకంగా సీఎం రిలీఫ్ ఫండ్‌నే కాజేశారు.. ఎలానో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
Cmrf Scam

Edited By:

Updated on: Aug 10, 2025 | 6:03 PM

కష్టాల్లో ఉన్న నిరుపేదలకు ముఖ్యంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి సీఎం సహాయ నిధి నుండి ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. ఖరీదైన వైద్యం చేయించు కోలేని పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండగా ఉంటుంది. స్థానిక ఎమ్మెల్యేల రిఫరెన్స్ తో సీఎం రిలీఫ్ ఫండ్ ను పేదలకు ప్రభుత్వం అందజేస్తుంది. సీఎం రిలీఫ్ ఫండ్ నగదు కోసం కొందరు కేటుగాళ్లు నకిలీ రోగులను సృష్టించడమే కాకుండా తప్పుడు బిల్లులు పెట్టుకొని పెద్ద మొత్తంలో నగదును అక్రమార్కులు స్వాహా చేశారు. వీటిపై ప్రభుత్వం పోలీసులు విచారణ జరిపి అనేక ఆసుపత్రులు, అక్రమార్కులపై కేసును కూడా నమోదు చేసింది. కానీ అక్రమార్కులు ఈసారి సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులను కొత్త తరహాలో స్వాహా చేశారు. లబ్ధిదారులకు బదులు అసలు పేరు పోలిన నకిలీల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులను మళ్ళించారు. రాష్ట్రవ్యాప్తంగా 2020 – 2021 నుండి మంజూరైన చెక్కుల తేదీల మార్చి నకిలీలకు బదలాయింపు చేసినట్టు తెలుస్తోంది. కోదాడలో వెలుగు చూసిన దందాకు సెక్రటేరియట్ ఉద్యోగి ఒకరు సహకరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కోదాడకు చెందిన వెంకటేశ్వరరావు అనారోగ్యం, గుండె సంబంధిత వ్యాధులతో సతమతమవుతున్నాడు. దీంతో హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంకటేశ్వరరావు గుండె ఆపరేషన్ చేయించుకున్నాడు. ఇందుకు నాలుగు లక్షల అరవై వేల రూపాయలు ఖర్చయింది. తనకు ఆర్థిక సహాయం చేయాలంటూ జి.వెంకటేశ్వర రావు స్థానిక ఎమ్మెల్యే సహకారంతో 2022లో సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఏడాది పాటు తిరిగినప్పటికీ సీఎం రిలీఫ్ ఫండ్ సాంక్షన్ కాలేదని స్థానిక నేతలు చెప్పారు. ఇంతలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడం, నూతన ఎమ్మెల్యే వద్దకు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వెంకటేశ్వరరావు తిరిగాడు. తమ వద్ద ఎలాంటి పెండింగ్ లేవని ప్రస్తుత ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సిబ్బంది చెప్పారు.

మరోవైపు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సిబ్బంది కూడా హైదరాబాద్ లోని సీఎం రిలీఫ్ ఫండ్ ప్రధాన కార్యాలయంలో వెంకటేశ్వరరావు దరఖాస్తుపై ఆరా తీశారు. 31 ఆగస్టు 2023 లోనే సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు మంజూరయ్యాయని అధికారులు తెలిపారు. 19 ఏప్రిల్ 2024న ఏపీలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఎస్బిఐ బ్యాంకులో గడ్డం వెంకటేశ్వరరావు పేరుతో డ్రా అయింది. దీంతో ఒక్కసారిగా వెంకటేశ్వర రావు షాక్ తిన్నాడు. జగ్గయ్యపేటకు చెందిన వెంకటేశ్వరరావు బాధితుడు వెంకటేశ్వరరావు సంప్రదించగా తనకే సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందని బుకాయించాడు. గట్టిగా నిలదీయడంతో తనతో పాటు మరో నలుగురు కలిసి డ్రా చేశారనీ బాధితుడు వాపోతున్నాడు.

బాధితుడు వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ దందాపై దర్యాప్తుని మొదలుపెట్టారు. ఈ కేసులో తీగలాగిన అధికారులకు నమ్మలేని నిజాలు తెలిశాయి. ఇప్పటికే జగ్గయ్యపేటకు చెందిన వెంకటేశ్వర రావుతోపాటు మరికొందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ముఠా గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ ను గోల్మాల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ముఠా లబ్ధిదారులకు బదులు అసలు పేరు పోలిన నకిలీల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పెద్ద మొత్తంలో మళ్లించినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల తేదీలు, నకిలీల పేరిట బదలాయించేందుకు ఈ దందాకు హైదరాబాద్ సెక్రటేరియట్ లోని ఓ ఉద్యోగి సహకరించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కోదాడ కేంద్రంగా నడిచిన కోట్ల రూపాయల దందా సాగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ కేస్ విచారణతో కొందరు అక్కడ మార్కులు పరారీలో ఉన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా నేరానికి పాల్పడి సర్కారును మోసం చేసిన కేసులో అసలు సూత్రధారులు, పాత్రధారులు ఎవరూ అనే విషయాన్ని రాబట్టడానికి పోలీసులు సీరియస్ గా దృష్టి సారించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.