CM KCR: అందుకే రాజ్యాంగం మార్చాలన్నాను..అందులో తప్పేముంది? కేంద్రంపై విరుచుకుపడిన సీఎం కేసీఆర్‌..

|

Feb 13, 2022 | 8:57 PM

దేశం బాగుపడాలన్న ఆకాంక్షతోనే రాజ్యాంగం మార్చాలన్నానని, అందులో తప్పేముందని తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) ప్రశ్నించారు.

CM KCR: అందుకే రాజ్యాంగం మార్చాలన్నాను..అందులో తప్పేముంది? కేంద్రంపై విరుచుకుపడిన సీఎం కేసీఆర్‌..
Follow us on

దేశం బాగుపడాలన్న ఆకాంక్షతోనే రాజ్యాంగం మార్చాలన్నానని, అందులో తప్పేముందని తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) దేశంలో అబద్ధాలతో పాలన కొనసాగిస్తున్నారని, ఆయన దేశానికి అవసరం లేదన్నారు. దేశంలోని ప్రజలకు అవసరమైతే కొత్త జాతీయ పార్టీని పెడతానని, అందులో తానే కీలక పాత్ర పోషిస్తానన్నారు. దేశంలో రాజకీయ ఫ్రంట్‌ కాకుండా, ప్రజల ఫ్రంట్‌ రావాలని పిలుపునిచ్చారు. ఈమేరకు ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్‌లో జరిగిన సమావేశంలో కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మోడీ అబద్ధాల్లో ఆరితేరిపోయారు. ఆయన చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి. దేశంలో విద్యుత్ సంస్కరణలను అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. మొన్న పార్లమెంట్ సాక్షిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లోనూ ఈ విషయం చెప్పుకొచ్చారు. ఇప్పుడేమో ఏడాదిలోపు అన్ని వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలంటున్నారు. అదేవిధంగా కొత్త వ్యవసాయ కనెక్షన్లు ఇవ్వొద్దంటున్నారు. ఇప్పటికే ఏపీలో కొన్ని వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 25వేలకు పైగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించారు. విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరించాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. బీజేపీకి చందాలు ఇచ్చే వారికి విద్యుత్‌ సంస్థలను కట్టబెడుతున్నారు. వీటికి సంస్కరణలు అని పేరు పెడుతున్నారు. పార్లమెంట్‌లో విద్యుత్‌ సంస్కరణలు బిల్లు అమోదం పొందకముందే అమలు చేయాలని చూస్తున్నారు. రాష్ట్రం నష్టాల్లో కూరుకుపోయినా తెలంగాణలో విద్యుత్‌ సంస్కరణలు అమలు చేయం.’

బీజేపీని తరిమికొట్టాలి..

‘బీజేపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టకపోతే దేశం సర్వనాశనమవుతుంది. మోడీ ప్రభుత్వం హయాంలో దేశంలో నిరుద్యోగం బాగా పెరిగింది. దేశంలో ఎక్కడ చూసినా అవినీతి కంపు కొడుతోంది. బీజేపీ పాలనతో 33 మంది ఆర్థిక నేరగాళ్లు దేశం వదిలిపారిపోయారు. వారిప్పుడు లండన్లో ఎంజాయ్‌ జల్సాలు చేస్తున్నారు. వీరిలో చాలామంది గుజరాతీయులే. కేంద్ర ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి చిట్టా అంతా వస్తోంది. త్వరలోనే రఫేల్‌ కుంభకోణంపై సుప్రీంలో కేసు వేస్తాం. ఈడీ, సీబీఐ, సీఐడీ పేర్లు చెప్పి తమకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని కేంద్ర ప్రభుత్వం బెదిరిస్తోంది. వారికి దొంగలు భయపడతారేమో.. నేనేందుకు భయపడతాను?.. దమ్ముంటే నన్ను జైల్లో పెట్టండి. ప్రధాని మోడీ గోల్‌మాల్‌ మాటలతో దేశ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఆయన వాజ్‌పేయి సిద్ధాంతాలను ఎప్పుడో గంగలో కలిపేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే పెట్రోల్‌ రేట్లు మళ్లీ పెంచుతారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం మతం పేరుతో రాజకీయాలకు పాల్పడుతోంది. కర్ణాటకలో ఏం జరుగుతుందో దేశంలోని యువత ఆలోచించాలి. ఇలాంటి పరిస్థితి అన్ని రాష్ట్రాల్లో వస్తే దేశం పరువు మంటగలుస్తుంది.’

యాదాద్రీకి ఆహ్వానింపై ఆలోచిస్తాం..

‘కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలతో పాటు ఆదాయాన్నిచ్చే సింగరేణి లాంటి సంస్థలను కార్పొరేట్లకు కట్టుబెట్టాలని చూస్తోంది. వీటిపై మాట్లాడితే ఈడీ, సీబీఐ కేసులంటూ బెదిరిస్తోంది. దేశం బాగుపడాలంటే కొత్త రాజ్యాంగం కావాలన్నాను. దేశంలో అందరికీ సమాన హక్కులు అందాలన్నాను. ఇందులో తప్పేముంది?. దేశంలో దళితుల జనాభా 19 శాతం పెరిగింది. అందుకు తగ్గట్లే రిజర్వేషన్లు కూడా పెంచాల్సిన అవసరముంది. నేను రాహుల్‌ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను మాత్రమే తప్పుబట్టాను. అంతేకానీ కాంగ్రెస్‌తో అంటకాగడానికి కాదు. ఇప్పటికే రెండుసార్లు ఒంటరిగానే ఎన్నికల్లో గెలిచాం. కాంగ్రెస్‌ తో పొత్తు మాకవసరం లేదు. ఇక యాదాద్రీ దేవస్థానం ప్రారంభోత్సవంపై మోడీకి ఆహ్వానంపై ఆలోచిస్తాం.’

దేశానికి మోడీ అవసరం లేదు..

‘దేశానికి మోడీ పాలన అవసరం లేదు. ఆయన కరెక్టుగా ఉంటే రైతులకు ఎందుకు క్షమాపణలు చెబుతారు. అంతకు ముందు గోద్రా అల్లర్లలోనూ ముస్లింలకు ఇలాగే క్షమాపణలు చెప్పారు. ప్రధానికి క్షమాపణ రాజకీయాలు బాగా అలవాటయ్యాయి. బీజేపీ ప్రభుత్వం హయాంలో దేశంలో నిరుద్యోగం బాగా పెరిగింది. మోడీకి దమ్ముంటే దేశాన్ని సింగపూర్‌, చైనా లాగా దేశాన్ని అభివృద్ధి చేయండి. కానీ ఈ ప్రభుత్వానికి ఇవేవీ చేతకావడం లేదు. అందుకే ఆయన పాలన అవసరం లేదు’ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు కేసీఆర్‌.

Also Read:Viral Video: వందే మాతరం పాటకు గున్న ఏనుగు డాన్స్‌ !! సూపర్బ్‌.. వీడియో

జూ కీపర్‌ను చంపి బోనులో నుంచి తప్పించుకున్న సింహాలు !! వీడియో

CM KCR Press Meet Highlights : ప్రజలకు అవసరమైతే దేశంలో కొత్త జాతీయ పార్టీ.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..