Telangana: వారికి తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్..2 లక్షల ఖాతాల్లోకి రూ 217 కోట్లు విడుదల.. పూర్తి వివరాలివే..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారమే ఎస్.హెచ్.జిల రుణాలకు వడ్డీ రేటు అమలు చేయాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా..

Telangana: వారికి తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్..2 లక్షల ఖాతాల్లోకి రూ 217 కోట్లు విడుదల.. పూర్తి వివరాలివే..
Kcr Sarkar To Deposit Money In Shgs Accounts

Updated on: Mar 20, 2023 | 10:07 PM

రాష్ట్రంలోని 2 ల‌క్ష‌ల మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లోకి రూ.217 కోట్లు జ‌మ అయ్యాయి. ఆర్థిక‌, వైద్యారోగ్య శాఖ‌ల మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు గ‌తేడాది డిసెంబ‌ర్ 23న స్టేట్ లెవ‌ల్ బ్యాంక‌ర్స్ కమిటీ (ఎస్‌.ఎల్‌.బీ.సీ) 35వ సమీక్ష సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారమే ఎస్.హెచ్.జిల రుణాలకు వడ్డీ రేటు అమలు చేయాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, అధికంగా వసూలు చేసిన సొమ్మును వడ్డీతో సహా చెల్లించాలని స్ప‌ష్టం చేశారు. మహిళా సంఘాల రుణాలపై ఎంత వ‌డ్డీ వసూలు చేయాలో 2022 జూలై 20న ఆర్బీఐ స్ప‌ష్ట‌మైన మార్గ‌ద‌ర్శ‌కాలు ఇచ్చింది. రూ.3లక్షల వరకు రుణంపై గ‌రిష్ఠంగా 7శాతం, రూ.3 నుంచి 5 లక్షల వరకు రుణంపై 10 శాతం వ‌సూలు చేయాల‌ని లేదా ఒక సంవత్సరం ఎంసీఎల్‌ఆర్‌ ఎది తక్కువైతే దానిని వసూలు చేయాల‌ని సూచించింది.

అయితే కొన్ని బ్యాంకులు ఈ నిబంధ‌న‌ను ప‌ట్టించుకోకుండా ఎక్కువ వడ్డిని వ‌సూలు చేశాయ‌ని, ఒకే బ్యాంకు ప‌రిధిలోని ఒక్కొ బ్రాంచిలో ఒక్కో విధంగా వడ్డిని వసూలు చేస్తున్నాయని మంత్రి హ‌రీశ్‌ రావు దృష్టికి వచ్చింది. దీంతో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు అధిక వ‌డ్డీ చెల్లించి న‌ష్ట‌పోతున్నార‌ని ఆయ‌న గుర్తించారు. ఈ విషయాన్ని 2022 డిసెంబర్‌ 23న జరిగిన ఎస్ఎల్‌బీసీలో చ‌ర్చించారు. ఆర్బీఐ నిబంధన‌లు పాటిస్తున్నారో లేదో బ్యాంక‌ర్లు మరోసారి సమీక్షించాలని సూచించారు. ఒకవేళ అధికంగా వడ్డిని వసూలు చేస్తే తిరిగి ఆ మొత్తాన్ని జ‌మ చేయాల‌ని ఆదేశించారు. దీంతో అధికారులు స‌మీక్ష నిర్వ‌హించ‌గా రాష్ట్ర వ్యాప్తంగా 2,03,535 సంఘాల నుంచి రూ.217.61కోట్ల మేర అధికంగా వ‌డ్డీని వసూలు చేశారని తేలింది. దీంతో అద‌నంగా వ‌సూలు చేసిన మొత్తాన్ని ఆయా సంఘాల ఖాతాల్లోకి సోమ‌వారం జమ చేశారు. మంత్రి హరీశ్‌ రావు ఆదేశాలతో రెండు లక్షల సంఘాలకు ల‌బ్ధి చేకూరింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..