CM KCR Review TSRTC: తెలంగాణ ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష.. నష్టాల్లో కొనసాగుతుందని తెలిపిన అధికారులు
CM KCR Review TSRTC: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీపై సమీక్ష నిర్వహించారు. పెరిగిన డీజిల్ ధరలు, కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్, గతంలో పేరుకుపోయిన..

CM KCR Review TSRTC: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీపై సమీక్ష నిర్వహించారు. పెరిగిన డీజిల్ ధరలు, కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్, గతంలో పేరుకుపోయిన బకాయిలు తదితర కారణాల వల్ల ఆర్టీసీ నష్టాల్లో కొనసాగుతోందని అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలు పెంచితే ఆర్థిక భారం మరింత పెరుగుతుందని వివరించారు. అలాగే ప్రభుత్వం సహాయం అందించడం, బస్సు చార్జీలు పెంచడం లాంటి చర్యలు తీసుకుంటే తప్ప ఆర్టీసీపై ఆర్థిక భారం తగ్గే అవకాశం లేదని వివరించారు. గతంతో పోలిస్తే ఆర్టీసీ కొంత మెరుగైందని, ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.
ఆర్టీసీలో కార్గో సర్వీసులు విజయవంతం అయ్యాయని, ప్రజలకు గొప్ప సేవలు అందిస్తున్నారని కేసీఆర్ ఆర్టీసీ అధికారులను అభినందించారు. కార్గో సేవల ద్వారా ఇప్పటికి 17.72 లక్షల పార్శిళ్లను గమ్యానికి చేరవేశారని, దీని వల్ల ఆర్టీసీకి రూ.22.61 కోట్ల ఆదాయం వచ్చిందని కేసీఆర్ తెలిపారు. ప్రజలు కూడా ఆర్టీసీ కార్గో సేవల పట్ల ఎంతో సంతృప్తిగా ఉన్నారని అన్నారు.