CM KCR Plan: కేంద్రంపై మరో పోరుకు కేసీఆర్‌ సన్నద్దం.. గ్రామస్థాయి నుంచే బీజేపీకి చెక్‌పెట్టేలా పక్కా ప్లాన్!

| Edited By: Balaraju Goud

Mar 20, 2022 | 7:59 PM

కేంద్రంపై మరోమారు పోరుకు సిద్ధమయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కాస్త సైలెంట్‌గా ఉన్న గులాబీ బాస్, రాజకీయాల్లో మళ్లీ కాకా రేపేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.

CM KCR Plan: కేంద్రంపై మరో పోరుకు కేసీఆర్‌ సన్నద్దం.. గ్రామస్థాయి నుంచే బీజేపీకి చెక్‌పెట్టేలా పక్కా ప్లాన్!
Kcr Modi
Follow us on

CM KCR Political Plan: కేంద్రంపై మరోమారు పోరుకు సిద్ధమయ్యారు తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు(KCR). ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కాస్త సైలెంట్‌గా ఉన్న గులాబీ బాస్, రాజకీయాల్లో మళ్లీ కాకా రేపేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. తెలంగాణ భవన్ నుంచి సమరానికి శంఖారావం పూరించనున్నారు. రాజకీయాల్లో అనూహ్య నిర్ణయాలు తీసుకునే కేసీఆర్, మరోసారి వరి పోరుతో కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు రెడీ అయ్యారు. స్పీడ్‌మీద ఉన్న కమలం నేతలకు బ్రేక్‌లు వేసేలా పక్కా ప్లాన్‌ సిద్ధం చేస్తున్నారు గులాబీ పార్టీ చీఫ్. ఐదు రాష్ట్రాల ఫలితాల తర్వాత, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ(BJP) స్పీడ్ పెంచింది. త్వరలోనే ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో మరోసారి ప్రజల ముందుకు వెళ్లబోతున్నారు బండి సంజయ్. దీంతో క్షేత్రస్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి వరకు బీజేపీకి చెక్‌ పెట్టే యోచనలో ఉన్నారు కేసీఆర్.

తెలంగాణ భవన్‌లో సోమవారం టీఆర్‌ఎస్ ఎల్పీ మీటింగ్‌ జరగనుంది. ఈ సమావేశంలో వరిధాన్యం విషయంలో రాష్ట్రంలో చేయాల్సిన ఆందోళనలతో పాటు 18 అంశాల పై నాయకులకు దిశా నిర్దేశం చేయనున్నారు గులాబీ దళపతి. ఆ తర్వాత మంత్రులు, ఎంపీలతో కలిసి ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. కేంద్ర మంత్రులను, అవసరమైతే ప్రధానిని కలిసి ధాన్యం కొనుగోలుపై తేల్చుకుంటామని స్పష్టం చేస్తున్నారు కేసీఆర్. మరో నెలన్నరలో యాసంగి పంట చేతికొస్తుంది. దీంతో ధాన్యం కొనుగోళ్లనే ప్రధానాస్త్రంగా చేసుకోవాలని ఎత్తుగడ వేశారు టీఆర్‌ఎస్‌ చీఫ్. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రాన్ని దోషిగా నిలబెట్టాలనేది కేసీఆర్‌ ప్లాన్‌గా తెలుస్తోంది.

గతంలోనే యాసంగి ధాన్యాన్ని కొనబోమని స్పష్టం చేసింది కేంద్రం. అప్పుడు సీఎం కేసీఆర్‌ కూడా వరి పంట వేయొద్దని రైతులకు సూచించారు. కానీ, రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం వరి పండించాలని రైతులకు సూచించారు. కేసీఆర్ మెడలు వంచైనా ధాన్యం కొనుగోలు చేయిస్తామన్నారు కమలం లీడర్లు. ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర బీజేపీ ఒకలా, కేంద్రం మరోలా రైతులను తప్పుదోవ పట్టించిందనేది ఇప్పుడు టీఆర్ఎస్‌కు ఆయుధంగా మారింది. దీంతో మళ్లీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేసి, బీజేపీతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని సీఎం ప్లాన్ వేసినట్లుగా తెలుస్తోంది.

ఢిల్లీలో ఏడాది పాటు జరిగిన రైతు ఉద్యమాలను స్ఫూర్తిగా తీసుకొని, అదే తరహాలో ఉద్యమించడానికి మాస్టర్ ప్లాన్ వేశారు గులాబీ చీఫ్. ఈ పరిస్థితిని ముందుగానే ఊహించిన కేసీఆర్, గత ఢిల్లీ పర్యటనలో రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్ భేటీ అయ్యారు. రెండో దఫా చేపట్టే వరి ధాన్యం ఉద్యమంలో, మిగతా రాష్ట్రాల రైతు నాయకులను ఇన్వాల్వ్ చేసి, పోరు కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నారు కేసిఆర్. ఇప్పటికే దేశ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన టీఆర్‌ఎస్‌ బాస్, ధాన్యం కొనుగోలు అంశాన్ని ప్రధానాస్త్రంగా చేసుకుని, తన వాదనను జాతీయస్థాయిలో వినిపించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read Also….

కేంద్రాన్ని బదనాం చేసేందుకే మళ్లీ వరి రగడ.. రాష్ట్రంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారుః బండి సంజయ్