Telangana: తెలంగాణలో ‘వీఆర్‌ఏ’ వ్యవస్థ శాశ్వతంగా రద్దు.. నేడు అధికారిక ఉత్తర్వులు జారీ

|

Jul 24, 2023 | 7:35 AM

తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. నీరటి, మస్కూరు, లష్కర్‌ వంటి పేర్లతో పిలుస్తూ భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్‌ (వీఆర్‌ఏ) వ్యవస్థను శాశ్వతంగా రద్దు..

Telangana: తెలంగాణలో వీఆర్‌ఏ వ్యవస్థ శాశ్వతంగా రద్దు.. నేడు అధికారిక ఉత్తర్వులు జారీ
CM K. Chandrashekar Rao
Follow us on

హైదరాబాద్‌, జులై 24: తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. నీరటి, మస్కూరు, లష్కర్‌ వంటి పేర్లతో పిలుస్తూ భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్‌ (వీఆర్‌ఏ) వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం (జులై 23) ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వీఆర్‌ఏలుగా పనిచేస్తున్న సిబ్బందిని విద్యార్హతల ఆధారంగా ఇతర శాఖల్లో క్రమబద్ధీకరిస్తామని ఆయన తెలిపారు. తొలగించిన వీఆర్‌ఏలు అందరినీ అర్హతల ఆధారంగా పురపాలక, మిషన్‌ భగీరథ, నీటిపారుదల తదితర శాఖల్లో సర్దుబాటు చేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారం జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. వీఆర్‌ఏల క్రమబద్ధీకరణ అంశంపై సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘కాలానుగుణంగా కనుమరుగవుతున్న వృత్తుల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఈ క్రమంలోనే వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేస్తున్నాం. గ్రామాల్లో వ్యవసాయ అభివృద్ధికి నీటి వ్యవస్థను సక్రమంగా నిర్వహించడం, గ్రామ రెవెన్యూ, ఇతర విభాగాల అవసరాల కోసం తొలినాళ్లలో వీఆర్‌ఏ వ్యవస్థ ఏర్పాటైంది. నేడు మారిన పరిస్థితుల్లో వీఆర్‌ఏ వృత్తికి ప్రాధాన్యత తగ్గింది. ఈ నేపథ్యంలో వారిని రెవెన్యూ శాఖలో క్రమబద్ధీకరించి ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకుంటున్నామని’ సీఎం కేసీఆర్‌ తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 20,555 మంది వీఆర్‌ఏలు పనిచేస్తున్నారు. వారిలో నిరక్షరాస్యులతోపాటు ఏడో తరగతి, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఉన్నత చదువులు చదివినవారూ ఉన్నారు. వారి విద్యార్హతల ఆధారంగా ఉద్యోగ కేటగిరీలను నిర్ధారించి ఆయా శాఖల్లో భర్తీ చేస్తాం. ఉన్నత చదువులు చదివి ప్రమోషన్లకు అర్హులైన వారిని అందుకు అనుగుణమైన పోస్టుల్లో నియమిస్తాం. అలాగే 61 ఏళ్ల వయసుపైబడిన వీఆర్‌ఏల వారసులకు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. దీనితోపాటు 61 ఏళ్లలోపు వయసు ఉండి 2014 జూన్‌ 2న తర్వాత ఏదైనా కారణంతో మరణించిన వీఆర్‌ఏల వారసులకు కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఆయన ప్రకటించారు. వీరి వివరాలను త్వరగా సేకరించి వారి అర్హతలు, ప్రభుత్వ నిబంధనల మేరకు వివిధ శాఖల్లోని ఉద్యోగాల్లో సర్దుబాటు చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.