సీఎం కేసీఆర్ దంపతులకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు.. అసలేం జరిగింది!
CM KCR: కేసీఆర్ దంపతులు ఏఐజీ ఆసుపత్రికి వెళ్లడంపై ఏఐజీ ఆసుపత్రి వైద్యులు స్పందించారు. సీఎం కేసీఆర్ కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చారని వెల్లడించారు. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఉదయం నుంచి కడుపునొప్పితో బాధపడుతున్న ఆయన్ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. ఆస్పత్రిలో కేసీఆర్‌కు ప్రత్యేక వైద్య బృందం పరీక్షలు చేసింది. ఎండోస్కోపీ పరీక్షలు చేశారు వైద్యులు. అయితే జనరల్ చెకప్‌లో భాగంగానే ముఖ్యమంత్రి దంపతులు ఆస్పత్రికి వచ్చినట్లు ఏఐజీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మెడికల్ చెకప్ కోసం కేసీఆర్ ఎప్పుడూ యశోద, నిమ్స్ ఆస్పత్రులకు మాత్రమే వెళ్తుంటారు. అయితే ఏఐజీకి ఎందుకొచ్చారన్నదీ చర్చనీయాంశంగా మారింది.
కాగా.. కేసీఆర్ సతీమణి శోభ కూడా అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం మధ్యాహ్నం స్వల్ప అస్వస్థతకు గురవ్వగా శోభాను గచ్చిబౌలిలోని AIG ఆస్పత్రికి తరలించారు. శోభా వెంట కేసీఆర్ కూడా ఆస్పత్రికి వెళ్లారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తన తల్లిని చూడటానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆస్పత్రికి వెళ్లారు. అమ్మ ఆరోగ్యంపై డాక్టర్లను అడిగి కవిత వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి నుంచి నేరుగా మీడియాతో మాట్లాడకుండానే బంజారాహిల్స్‌లోని తన నివాసానికి కవిత వెళ్లిపోయారు. అయితే.. శోభను ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత కేసీఆర్ కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. మరోవైపు.. కేసీఆర్ అస్వస్థతకు గురవ్వడంతో ఏఐజీ ఆస్పత్రికి తరించారు.
కేసీఆర్ దంపతులు ఏఐజీ ఆసుపత్రికి వెళ్లడంపై ఏఐజీ ఆసుపత్రి వైద్యులు స్పందించారు. సీఎం కేసీఆర్ కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చారని వెల్లడించారు. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయనకు పొత్తికడుపులో అసౌకర్యం ఏర్పడిందని తెలిపారు. సీఎం కేసీఆర్ కు ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి నేతృత్వంలో వైద్య పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఎండోస్కోపీ, సీటీ స్కాన్ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. సీఎం కేసీఆర్ కు పొత్తికడుపులో అల్సర్ ఉన్నట్టు గుర్తించామని వైద్యులు వెల్లడించారు. మిగతా వైద్య పరీక్షల ఫలితాలు సాధారణంగానే వచ్చాయని వివరించారు.

Kcr Health Bulletin
