CLP Leader Bhatti Vikramarka : కరోనా కట్టడిలో తెలంగాణ సర్కార్ విఫలమైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ ఇష్టం వచ్చినట్లు దోచుకుంటున్నా.. పట్టించుకునే వారే లేరని విమర్శించారు. “టాస్క్ ఫోర్స్ వేశారు అది ఉత్తదే.. సీఎస్ సోమేశ్ కుమార్ సీరియస్ గా పనిచేయడం లేదు. కో ఆర్డినేట్ చేయాల్సిన సీఎస్.. సమావేశంలో బిస్కెట్స్ తినుకుంటూ.. కనిపిస్తున్నారు.” అంటూ భట్టి జూమ్ మీటింగ్ ద్వారా ఆరోపించారు. మొదటి డోస్ కరోనా వ్యాక్సిన్ దేవుడెరుగు.. రెండో డోస్ కూడా దొరకడం లేదన్న ఆయన, రెండో డోస్ కూడా ఇవ్వకుండా ఆపడం.. దారుణమని వ్యాఖ్యానించారు. ప్రజల ప్రాణాలు గాలికి వదిలారని.. ఫార్మా కంపెనీలతో సీఎస్, టాస్క్ ఫోర్స్ ఛైర్మెన్, మంత్రి కేటీఆర్.. సదరు సమావేశంలో అసలు ఏం మాట్లాడారని ఆయన ప్రశ్నించారు. రెమిడిసివర్ ఇంజక్షన్ దొరక్క బ్లాక్ మార్కెట్ లో జనం కొనుకుంటున్నారని, 48 గంటల్లో పాత జీవో పని చేయకుండా చేశారని ఆరోపించారు. సర్కార్ కోమాల్లో ఉన్నట్లు వుంది.. అంటూ భట్టి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
“పాత సినిమాల పాతాళ భైరవి లా.. సీఎం కేసీఆర్ అలా వచ్చి మీటింగ్ పెట్టి వెళ్ళిపోతారు. ఒంటెద్దు పోకడతో సర్కార్ పోతుంది. కేటీఆర్ కు టాస్క్ ఫోర్స్ ఛైర్మెన్ పదవి రాగానే.. వ్యాక్సిన్ బంద్ అయ్యింది. అంటూ భట్టి ఎద్దేవా చేశారు. “మీ వల్ల కాకుంటే.. మా సలహాలు సూచనలు తీసుకోండి.. మండలాల్లో, గ్రామాల్లో ఐసోలేషన్ సెంటర్స్ పెడితే.. హైదరాబాద్ పై ఫోర్స్ తగ్గుతుంది. సీఎస్ కు ఆ పట్టింపు లేదు.. తెలివైన వారిని కమిటీలో పెట్టుకోండి.” అంటూ భట్టి విక్రమార్క చురకలంటించారు.