
Chief Minister KCR: పరిపాలనలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పీడ్ పెంచారు. గత కొంత కాలంగా అన్ని ప్రభుత్వ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నాడు కీలక భేటీ జరగనుంది. మంత్రులు, జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సోమవారం కీలక సమావేశం నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 11.30 గంటలకు ప్రగతి భవన్‌లో ఈ సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి సమగ్ర సమాచారంతో సమావేశానికి రావాలని జిల్లాల కలెక్టర్లకు, ఉన్నతాధికారులకు సీఎంఓ నుంచి ఆదేశాలు వెళ్లాయి. రేపటి సమావేశంలో.. రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్య, విద్యాశాఖ, అటవీశాఖలపై రేపటి భేటీలో కీలక చర్చ జరగనుంది. పెండింగ్ మ్యుటేషన్లు, సాదాబైనామాలా క్రమబద్దీకరణ, ట్రిబ్యూనల్ ఏర్పాట్లు, పార్ట్ బిలో చేర్చిన అంశాల పరిష్కారం, కరోనా వ్యాక్సినేషన్, కరోనా కారణంగా 10 నెలలుగా మూత పడిన పాఠశాలల ప్రారంభంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
ఇదే సమయంలో ధరణి పోర్టల్‌లో సాదాబైనామాల రిజిస్ట్రేషన్లలో తలెత్తుతున్న సమస్యలపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా, సంక్రాంతి తరువాత స్కూళ్లు తెరిచే అవకాశం కనిపిస్తోంది. ఆమేరకు విద్యాశాఖ కూడా తన నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక అటవీశాఖ పరంగా తలెత్తిన భూ వివాదాల పైనా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అటవీ భూ వివాదాల పరిష్కారం, అటవి భూముల విస్తీర్ణంపై చర్చించి కీలక నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ వెల్లడించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. ఇదిలాఉండగా, కరోనా వ్యాక్సినేషన్ ఏర్పాట్లపై సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్ కూడా పాల్గొంటారు.
Also read:
Congress VS Governor: దమ్ముంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవండి.. గవర్నర్‌కు కాంగ్రెస్ నేతల సవాల్..