హైదరాబాద్: ఓవైపు ఎండలు మండిపోతుంటే.. మరోవైపు చికెన్ ధరలు అంతకంతకూ పైపైకి ఎగబాకుతున్నాయి. కోడి ధరలు చూసి సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. చుక్కలనంటిన చికెన్ ధరలతో గగ్గోలు పెడుతున్నాడు. నెల రోజుల క్రితం సరైన ధరలు లేక నేలచూపులు చూసిన మార్కెట్.. ఇప్పుడు ఆల్‌టైం రికార్డును బ్రేక్ చేసింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఫారాల్లో కోళ్లు పెద్దమొత్తంలో మృతి చెందుతున్నాయి. మరోవైపు కోళ్లకు వేసే దాణా ధరలు పెరిగాయని నిర్వాహకులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో రెండు వారాల్లోనే ఏకంగా రూ.100 ధర పెరిగింది. దీంతో వినియోగదారుల అవసరం మేర ఉత్పత్తి లేకపోవడం ప్రస్తుతం కోడిమాసం ధరలు కొండెక్కి కూర్చున్నాయి. డిమాండ్ అధికం.. సప్లయ్ తక్కువగా ఉండటంతో చేసేదిలేక పలువురు రైతులు ఫారాలు నడపలేక మూసేస్తున్నారు. మరికొందరేమో ఫారాల వద్ద కూలర్లు, రెయిన్ డ్రిప్, స్ప్రీంక్లర్లు ఏర్పాటు చేసి చల్లదనం అందిస్తున్నారు.
ప్రస్తుతం స్కిన్ లెస్ చికెన్ కిలోకు రూ.320 వరకు పలుకుతోంది. లైవ్ కోడి ధర కిలోకు రూ.190 ఉంది. బోన్ లెస్ చికెన్ రికార్డు స్థాయిలో ఏకంగా కిలోకు రూ.550 ధర చొప్పున విక్రయిస్తున్నారు. రెండేళ్ల కాలంలో ఇవే అత్యధిక ధరలని వ్యాపారులు చెబుతున్నారు. ఆదివారం వస్తే చాలు గ్రేటర్ హైదరాబాద్‌వాసులు 8 నుంచి 12 లక్షల కిలోలవరకూ, మిగిలిన రోజుల్లో 5 నుంచి 7 లక్షల కిలోల వరకు విక్రయాలు జరుగుతుంటాయి. తాజాగా ధరల పెరుగుదలతో విక్రయాలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.