AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..! కేబినెట్ విస్తరణపై సర్వత్రా ఉత్కంఠ..

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం నుంచి రెండు రోజుల పాటు దిల్లీలో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రులతో భేటీలతో పాటు కాంగ్రెస్‌ అధిష్ఠానంతోనూ కీలక చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో మంత్రి కొండా సురేఖ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వ్యవహారంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..! కేబినెట్ విస్తరణపై సర్వత్రా ఉత్కంఠ..
CM Revanth Reddy Delhi Visit
Prabhakar M
| Edited By: |

Updated on: Sep 01, 2026 | 8:11 AM

Share

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం నుంచి రెండు రోజుల పాటు దిల్లీలో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలతో పాటు కాంగ్రెస్‌ అధిష్ఠానంలోని ముఖ్య నేతలతోనూ ఆయన భేటీ కానున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతేకాకుండా.. కేబినెట్ విస్తరణపై కూడా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.. కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. అసెంబ్లీ సమావేశాలకు ముందే.. మంత్రి మండలి విస్తరణ జరిగే అవకాశం ఉందని సమాచారం.. అదే జరిగితే.. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పలువురికి అవకాశం దక్కుతుందని పేర్కొంటున్నారు. అయితే.. కొత్తగా ఎవరికి అవకాశం కల్పిస్తారనే అంశాలపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.

సురేఖ, చిన్నారెడ్డి అంశంపై చర్చ?

మంత్రి కొండా సురేఖ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి సంబంధించిన వ్యవహారం సీఎం దిల్లీ పర్యటనలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ అంశంపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమర్పించిన నివేదికపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో రేవంత్‌రెడ్డి చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

పార్టీ క్రమశిక్షణకు సంబంధించిన అంశంలో అధిష్ఠానం సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇద్దరిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం ప్రస్తుతం పార్టీలో కొనసాగుతోంది.

కొండా సురేఖ విషయంలో సీఎం వైఖరి కీలకం

మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించే అంశాన్ని సీఎం అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికీ.. సురేఖ వ్యవహారంలో మాత్రం సీఎం తన వైఖరిలో వెనక్కి తగ్గకపోవచ్చనే అభిప్రాయం కాంగ్రెస్‌ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తోనూ ముఖ్యమంత్రి ఈ అంశంపై చర్చించినట్లు సమాచారం. మరోవైపు కొండా సురేఖపై కఠిన చర్యలు తీసుకోకుండా చూడాలని కొందరు మంత్రులు, కాంగ్రెస్‌ నేతలు ఇన్‌చార్జిని కోరినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఆమె నుంచి స్పష్టమైన హామీ రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అధిష్ఠానం జోక్యం చేసుకుని ముఖ్యమంత్రితో చర్చిస్తే నిర్ణయంలో మార్పు ఉండే అవకాశం ఉందని.. లేనిపక్షంలో సురేఖపై చర్యలు తప్పకపోవచ్చనే చర్చ జరుగుతోంది.

మెట్రో, మామునూరు విమానాశ్రయంపై కేంద్రంతో చర్చలు

దిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. హైదరాబాద్‌ మెట్రో రైలు విస్తరణ అంశంపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో సమావేశం కానున్నట్లు సమాచారం.

మామునూరు విమానాశ్రయ అభివృద్ధి, పురోగతిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడుతో చర్చించనున్నారు.

డిఫెన్స్‌ పెట్టుబడులపైనా చర్చ

డిసెంబరు 7 నుంచి 9 వరకు ఫ్యూచర్‌ సిటీలో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సదస్సుకు ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ సదస్సులో పలు రక్షణ రంగ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునే అంశంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులు, పెట్టుబడులు, కేంద్ర సహకారం వంటి అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించడంతో పాటు.. పార్టీ అంతర్గత వ్యవహారాలపై కాంగ్రెస్‌ అధిష్ఠానంతో సీఎం భేటీ కానుండటంతో రేవంత్‌రెడ్డి దిల్లీ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us