AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రియుడితో వెళ్లి.. శవమై తేలిన వివాహిత.. హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులు!

రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో కల్యాణి హత్య కేసును పోలీసులు ఛేదించారు. తన ప్రియుడు నరసింహమూర్తితో సహజీవనం చేస్తున్న కల్యాణిని, గొడవల కారణంగా నరసింహమూర్తి నైలాన్ తాడుతో గొంతు నులిమి హత్య చేశాడు. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి, ఫోన్ మెసేజ్‌లు పంపి పరారయ్యాడు. పటిష్టమైన దర్యాప్తుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, కేసు మిస్టరీని బహిర్గతం చేశారు.

ప్రియుడితో వెళ్లి.. శవమై తేలిన వివాహిత.. హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులు!
Murder Mystery
Balaraju Goud
|

Updated on: Sep 17, 2026 | 8:05 PM

Share

రంగారెడ్డి: ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తున్న ఓ వివాహిత అనుమానాస్పద మృతి కేసును ఆదిభట్ల పోలీసులు ఛేదించారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని నాదర్‌గుల్‌లో జరిగిన కల్యాణి మృతి ఘటన ఆత్మహత్య కాదని.. ఆమెను ప్రియుడు నరసింహమూర్తి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్యాణి తన భర్త, పిల్లలను వదిలి నాదర్‌గుల్‌లో నరసింహమూర్తితో కలిసి సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా నరసింహమూర్తి మద్యం సేవించే విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో జరిగిన గొడవలో నరసింహమూర్తి నైలాన్ తాడుతో కల్యాణి మెడను బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అనంతరం ఈ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఆధారాలను తారుమారు చేసినట్లు ఏసీపీ ప్రదీప్ కుమార్ రెడ్డి తెలిపారు. అంతటితో ఆగకుండా.. కల్యాణి ఫోన్‌ను ఉపయోగించి ఆమె భర్త, బంధువులకు తప్పుడు మెసేజ్‌లు పంపినట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు చెప్పారు. అనంతరం నరసింహమూర్తి అక్కడి నుంచి పరారైనట్లు తెలిపారు.

కల్యాణి మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, ఫోన్‌కు సంబంధించిన వివరాలు, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నరసింహమూర్తిపై అనుమానాలు బలపడటంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో హత్యకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఏసీపీ ప్రదీప్‌కుమార్ రెడ్డి వెల్లడించిన వివరాల ఆధారంగా నరసింహమూర్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన సీఐ రమేశ్, ఎస్సైలు, క్రైమ్ టీమ్‌ను ఉన్నతాధికారులు అభినందించారు. దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి రివార్డులు అందజేశారు. ఈ కేసులో లభించిన ఆధారాలు, నిందితుడి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us