AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏడేళ్ల బాలుడి మాటలతో వెలుగులోకి షాకింగ్ నిజం.. జైలుపాలైన కన్నతల్లి..!

పొన్నూరులో అమ్మమ్మ లక్ష్మి హత్య కేసు మిస్టరీని ఆమె ఏడేళ్ల మనవడు ఛేదించాడు. బంగారు గొలుసు కోసం కూతురు పుష్పలత, ఆమె భర్త రాజ్‌కుమార్ లక్ష్మిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాలుడి వాంగ్మూలం ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది, కేసులో మరింత దర్యాప్తు జరుగుతోంది.

ఏడేళ్ల బాలుడి మాటలతో వెలుగులోకి షాకింగ్ నిజం.. జైలుపాలైన కన్నతల్లి..!
Ponnur Crime News
T Nagaraju
| Edited By: |

Updated on: Sep 17, 2026 | 7:44 PM

Share

పొన్నూరు: బంగారు తాడు కోసం కన్న తల్లిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కూతురు, ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గుంటూరు జిల్లా పొన్నూరు క్యాబిన్‌పేటకు చెందిన లక్ష్మీ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయాగా పనిచేస్తోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు కాగా.. కుమార్తె పుష్పలతకు గతంలో వివాహం జరిగింది.

పుష్పలతకు ఓ కుమారుడు జన్మించిన అనంతరం భర్తకు దూరంగా ఉంటుంది. బాలుడు అప్పటి నుంచి అమ్మమ్మ లక్ష్మీ వద్దే పెరుగుతున్నాడు. అనంతరం హైదరాబాద్ వెళ్లిన పుష్పలత మరో వ్యక్తిని వివాహం చేసుకోగా.. అతను రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం. ఆ తర్వాత పొన్నూరుకు వచ్చిన ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రాజ్‌కుమార్ పరిచయం కాగా.. అతడిని వివాహం చేసుకుంది.

ఇదిలా ఉండగా.. సుమారు మూడు నెలల క్రితం లక్ష్మీ కుమారుడు కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతడి మరణానికి సంబంధించిన బీమా సొమ్ము కుటుంబానికి అందింది. ఆ తర్వాత పుష్పలత, ఆమె భర్త రాజ్‌కుమార్ లక్ష్మీ వద్దే ఉంటున్నారని పోలీసులు తెలిపారు. కుటుంబ పోషణ కష్టంగా మారడంతో ఇద్దరూ తన ఇంటి నుంచి వెళ్లిపోవాలని లక్ష్మీ పలుమార్లు చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో తన తమ్ముడికి సంబంధించిన బీమా సొమ్ములో వాటా ఇవ్వాలని పుష్పలత కోరినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ మొత్తంతో లక్ష్మీ తాను తాకట్టు పెట్టిన బంగారు తాడును విడిపించుకున్నట్లు తెలుస్తోంది. ఆ ఆభరణాన్ని తనకు ఇవ్వాలని పుష్పలత డిమాండ్ చేయగా.. లక్ష్మీ నిరాకరించినట్లు పోలీసులు వెల్లడించారు.

దీంతో ఆ బంగారు తాడును తీసుకెళ్లేందుకు లక్ష్మీని హత్య చేయాలని పుష్పలత, రాజ్‌కుమార్ నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి లక్ష్మీ నిద్రిస్తున్న సమయంలో ఆమె ముఖంపై దుప్పటి కప్పి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు కేసు నమోదైంది. అనంతరం ఇంట్లోని బంగారు తాడును తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనను లక్ష్మీ వద్ద పెరుగుతున్న ఏడేళ్ల మనవడు చూసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే బాలుడికి సైకిల్ కొనిస్తామని చెప్పి ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని నిందితులు చెప్పినట్లు పోలీసుల విచారణలో తేలింది. లక్ష్మీ మృతిపై పోలీసులు, స్థానికులు ఆరా తీస్తున్న సమయంలో బాలుడు జరిగిన విషయాన్ని వెల్లడించడంతో కేసులో కీలక సమాచారం లభించింది. బాలుడి వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు పుష్పలత, ఆమె భర్త రాజ్‌కుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బంగారు ఆభరణం కోసం జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ హత్యపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us