తెలంగాణ బీజేపీలో అంతా సెట్ రైట్ అయినట్టే కనిపిస్తోంది. ఇంతవరకూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్ననేతలు..ఒక్కతాటిపైకి వచ్చారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్‌బన్సాల్ పర్యటన, నేతలతో కీలక సమావేశాల నేపథ్యంలో కాషాయ నేతలంతా ఏకమయ్యారు. దీంతో కమలం పార్టీలో సరికొత్త జోష్ కనిపిస్తోంది. ఇదే జోష్‌లో మూసీ అంశంలో ప్రభుత్వంపై పోరాటానికి కార్యాచరణ ప్రకటించింది..తెలంగాణ బీజేపీ. ఈ నెల 23, 24 తేదీల్లో మూసీ ప్రాంతంలో బీజేపీ నేతలు పర్యటించనున్నారు. మూసీ బాధితుల కోసం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అధ్యక్షతన ఈ 25న ఇందిరాపార్క్ దగ్గర ధర్నా కూడా చేపట్టింది తెలంగాణ బీజేపీ..
మరోవైపు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసిన బీజేపీ నేతల బృందం.. ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహం ధ్వంసం, హిందూ సంఘాలపై కేసుల నమోదుపై ఫిర్యాదు చేసింది. పోలీసుల లాఠీచార్జ్‌లో గాయపడ్డ వారి వివరాలను గవర్నర్‌కు అందజేశారు..బీజేపీ ప్రతినిధులు. రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని గవర్నర్‌ను కోరారు. అటు ఇదే అంశంపై డీజీపీ జితేందర్‌ను కూడా కలిసి ఫిర్యాదు చేశారు..బీజేపీ నేతలు.
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఎనిమిది ఎమ్మెల్యే, ఎనిమిది ఎంపీ సీట్లను గెల్చుకున్న కమలం పార్టీ..గతంతో పోలిస్తే రాష్ట్రంలో ప్రాతినిధ్యం పెంచుకుంది. అయినా ఆ స్థాయిలో పార్టీ ఎలాంటి యాక్టివిటీ చేపట్టలేదనే నిరుత్సాహం బీజేపీ శ్రేణుల్లో ఉంది. పార్టీ సభ్యత్వ కూడా ఆశించిన స్థాయిలో జరగడం లేదన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హైడ్రా, మూసీ పునరుజ్జీవం కార్యక్రమాలపై పార్టీ విధాన నిర్ణయం తెలియక ఎమ్మెల్యేలు, ఎంపీలు తలో మాట మాట్లాడుతున్నారు. ఈ భిన్నవాదనలతో క్యాడర్‌లో కూడా అయోమయం నెలకున్న పరిస్థితి.
పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఈటల రాజేందర్ పార్టీ పేరుతో కాకుండా సొంతంగాప్రజా ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. హైడ్రా, మూసీ బాధితుల విషయంలో ఆయన సొంతంగానే వెళ్లారు. అదే సమయంలో ప్రభుత్వం తెచ్చిన హైడ్రాను ఈటల రాజేందర్ వ్యతిరేకిస్తుంటే..మెదక్ ఎంపీ రఘునందనరావు, చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి సమర్థించారు. కేంద్రమంత్రి బండి సంజయ్ గ్రూప్-1 వ్యవహారం, ముత్యాలమ్మ గుడి వివాదంపై ప్రభుత్వంపై పోరాటం చేపట్టారు. ఇలా నేతలు పార్టీ తరపున స్టాండ్ తీసుకోకుండా వేర్వేరు అజెండాలతో ముందుకు వెళ్తుండడం.. క్యాడర్‌లో గందరగోళానికి కారణమవుతుంది. పార్టీ నేతల తీరు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉందన్న చర్చ కూడా సాగుతోంది. దీంతో ఈ పరిస్థితి అడ్డుకట్ట వేయాలని డిసైడ్ అయింది..పార్టీ. ఇకపై ఒక్కో నేత ఒక్కో అజెండాతో ముందుకు వెళ్లకుండా..పార్టీ అజెండానే ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని అధిష్ఠానం స్పష్టం చేసింది. మరి బన్సల్ గీతోపదేశంతో పార్టీలో ఇంకా ఎలాంటి మార్పులు జరుగుతాయో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..