Telangana: నేటితో ముగియనున్న బండి సంజయ్ నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర.. తర్వాత ప్లాన్ ఏంటంటే..

|

Sep 22, 2022 | 8:16 AM

తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం కోసం భారతీయ జనతాపార్టీ తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర నేటితో ముగియనుంది. ఇప్పటికే తెలంగాణ..

Telangana: నేటితో ముగియనున్న బండి సంజయ్ నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర.. తర్వాత ప్లాన్ ఏంటంటే..
Bandi Sanjay
Follow us on

తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం కోసం భారతీయ జనతాపార్టీ (BJP) తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర నేటితో ముగియనుంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా మూడు విడతల ప్రజాసంగ్రామ యాత్ర పూర్తిచేసుకుని.. సెప్టెంబర్ 12వ తేదీన నాలుగో విడత పాదయాత్ర గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రారంభించారు. పది రోజుల పాటు సాగిన ఈపాదయాత్ర సెప్టెంబర్ 22వ తేదీ గురువారంతో ముగుస్తుంది. నాలుగో విడత పాదయాత్ర ముగింపు సందర్భంగా పెద్ద అంబర్ పేటలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈసభకు కేంద్ర మంత్రి సాద్వి నిరంజన్ జ్యోతి ( Sadhvi Niranjan Jyoti) ముఖ్య అతిథిగా హాజరవుతారు. సెప్టెంబర్ 12వ తేదీన బండి సంజయ్(BANDI SANJAY) మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం చిత్తారమ్మ అమ్మవారిని దర్శించుకుని పాదయాత్ర ప్రారంభించారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని కుత్బుల్లాపూర్, కూకట్​పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజిగిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీ నగర్​తో పాటు.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగింది. నాలుగో విడత దాదాపు 115 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. తన ప్రజాసంగ్రామ యాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.

మొత్తం నాలుగు విడతల్లో కలిపి 8 పార్లమెంట్​ నియోజకవర్గాలతో 48 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పాదయాత్రను పూర్తిచేసినట్లు అవుతోంది. పెద్ద అంబర్​పేట ఔటర్ రింగు రోడ్డు వద్ద.. బండి సంజయ్ నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగియనుంది. ఈపది రోజుల పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను బహిరంగ సభ వేదిక నుంచి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ప్రధానంగా ముగింపు సభలో టీఆర్ ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ బండి సంజయ్ ప్రసంగం సాగే అవకాశం ఉంది. నాలుగో విడత పాదయాత్ర తర్వాత మరో విడత పాదయాత్ర ఎప్పుడూ చేపట్టేది కూడా బండి సంజయ్ ప్రకటించే అవకాశం ఉంది. అయితే మరో వారం నుంచి రెండు వారాల్లోపు మునుగోడు శాసనసభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ ఉందన్న ప్రచారం నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నిక తర్వాతే ఐదో విడత పాదయాత్ర చేపట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..