సీట్లు పోయిన అ సిట్టింగులు ఎక్కడ.. ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు..?

| Edited By: Balaraju Goud

Oct 12, 2023 | 3:19 PM

ఆ ఇద్దరు అక్కడేనా? ప్రస్తుతం ఆ ఇద్దరు ప్రగతి భవన్ లో ఏం చేస్తున్నారు.?వారు ఎన్నికల ప్రచారం లో ఉంటే అధికార పార్టీకి ఇబ్బంది తప్పదా? అందుకే ఆ ఇద్దరికీ ఎన్నికల బాధ్యతలు అప్పగించారా?

సీట్లు పోయిన అ సిట్టింగులు ఎక్కడ.. ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు..?
Follow us on

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్నా కొద్దీ.. రాజకీయాల సమీకరణాలు మారుతున్నాయి. అందులోనూ అధికార బీఆర్ఎస్ పార్టీలో.. మరీ వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా జనగామ జిల్లాలో రాజీ ఫార్ములాతో అసమ్మతి నేతలందరినీ ఒక్కతాటి మీదకు తీసుకువచ్చింది అధినాయకత్వం. ఛైర్మన్ పదవులతో అసంతృప్తులైన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్య ఇద్దరినీ సీఎం కేసీఆర్ సంతృప్తిపరిచారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పేరున్న ఆ ఇద్దరు నేతలు గత రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. జనగామ, స్టేషన్ ఘన్‌పూర్ నుంచి పోటీ చేసి 2014, 2018 ఎన్నికల్లో రెండు దఫాలుగా గెలిచిన రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిలకు ఈసారి అవకాశం ఇవ్వలేదు. మూడోసారి అధికారమే లక్ష్యంగా కీలక అడుగులు వేస్తుంది బీఆర్ఎస్ అధిష్టానం. ఈ క్రమంలోనే కొన్ని సర్వేల ఆధారంగా వారిద్దరికీ అవకాశం దక్కలేదు. ఈ స్థానాల్లో ఇద్దరు ఎమ్మెల్సీలకు పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. అందుకే ఈసారి ఎమ్మెల్యే రాజయ్య, ముత్తిరెడ్డికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టి సంతృప్తి పరిచారు అధినేత కేసీఆర్. ఎన్నికలు నోటిఫికేషన్ రాక ముందే ఆ ఇద్దరు నేతలు కూడా పదవి బాధ్యతలు స్వీకరించారు. టికెట్ రాకపోవడంతో కొంత అసంతృప్తితో ఉన్నా.. ఇద్దరు నేతలు కొంత తగ్గినట్లే కనిపిస్తోంది.

రాష్ట్రంలో హ్యట్రిక్ కొట్టాలన్న సంకల్పంతో అందరి కంటే ముందుగానే బీఆర్ఎస్ పార్టీ తన గెలుపు గుర్రాల జాబితాను విడుదల చేసింది. ఇందులో భాగంగానే దాదాపు సిట్టింగులకే మళ్లీ స్థానం కల్పించిన అధినేత.. కొన్ని స్థానాల్లో మాత్రం ఇతరులకు అవకాశం కల్పించారు. అందులో నాలుగు స్థానాలను మాత్రం పెండింగ్‌లో పెట్టారు. అయితే.. ఆ పెండింగ్ పెట్టిన స్థానాల్లో జనగామ పంచాయితీ అంతా ఇంతా కాదు. టికెట్ నాకంటే నాకే అంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఏకంగా రోడ్డెక్కి యుద్ధం చేసినంత పని చేశారు. ఈ పంచాయితీని పరిష్కరించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కూడా ప్రయత్నించారు. చివరికి.. అధినేత కేసీఆరే స్వయంగా కల్పించుకుని జనగామ పంచాయితీని పరిష్కరించారు. దీంతో.. ముత్తిరెడ్డికి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చేసి.. జనగామ టికెట్ పల్లా రాజేశ్వర రెడ్డికి కన్‌ఫామ్ చేయడంతో పంచాయితికీ పుల్ స్టాప్ పెట్టేశారు కేసీఆర్.

మరోవైపు.. సిట్టింగ్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు సైతం ఇది పరిస్థితి. రాజయ్యను కాదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి టికెట్ కట్టబెట్టారు అధినేత కేసీఆర్. కాగా.. బీఫామ్ ఇచ్చేలోపే సమీకరణాలు మారతాయంటూ రాజయ్య ఆశాభావం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే.. ప్రగతి భవన్‌కు పిలిచి మరీ కేటీఆర్.. బుజ్జగింపు చర్యలు చేపట్టారు. చివరికి.. రాజయ్యకు కేబినెట్ హోదాతో సమానమైన నామినేటెడ్ పదవి ఇచ్చి.. సైలెంట్ చేసేశారు ముఖ్యమంత్రి కేసీఆర్.

ఇంతవరకు బాగానే ఉన్న ఈ ఇద్దరు నేతలు నియోజకవర్గంలో ఉంటే ఇబ్బంది అనే పార్టీ అధిష్టానం భావించింది. అందుకే ఈ ఇద్దర్నీ ప్రగతి భవన్ కు పిలిపించారు కేసిఆర్. గత వారం రోజులుగా ప్రగతి భవన్‌లోనే ఉంటున్నారు ఇద్దరు నేతలు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ప్రగతి భవన్‌కే పరిమితం అవుతున్నారు. ప్రత్యేకంగా ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. జిల్లాల నుంచి వచ్చే ప్రతి రిపోర్ట్ కేసీఆర్‌కు అందజేయాల్సిన బాధ్యత వీరిద్దరిది. అందుకనుగుణంగా సలహాలు,సూచనలు ఇస్తుండాలి. ఇలా వీరిని ప్రగతి భవన్‌లో తన దగ్గరే పెట్టుకున్నారు కేసిఆర్. వార్ రూమ్ లో ప్రతి రోజూ మానిటరింగ్ చేసేలా ప్రత్యేక ఏర్పాటు చేసింది బీఆర్ఎస్.

ఇలా కొంత మందికి ఇప్పటికే బాధ్యతలు అప్పగించి వీరిని ప్రతి క్షణం ఓ కంట కనిపెడుతున్నారు కేసిఆర్. ఎన్నికల వేళ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు బీఆర్ఎస్ అధినేత. అందుకే ఇలాంటి అసమ్మడి నేతలను తన పర్యవేక్షణలో ఉంచుకున్నారు కేసీఆర్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..