Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Election: ఎనిమిది సార్లు గెలిచిన సీపీఎం కంచుకోటలో కాంగ్రెస్ పాగా.. ఈసారీ త్రిముఖ పోటీ తప్పదా..?

నాలుగు రాష్ట్రాల సరిహద్దు పూర్తి ఏజెన్సీ నియోజక వర్గం. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు తిరుగులేని విజయాలతో ఎర్రజెండా ఎగిరింది. భద్రాచలం నియోజకవర్గం సీపీఎం పార్టీకి కంచుకోటగా మారింది. ఇప్పుడు మారిన రాజకీయ పరిణామాలతో కొంత పట్టు కోల్పోయింది. అయితే ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఎం పొత్తు కుదరక పోవడంతో, సీపీఎం ఒంటరిగా బరిలోకి దిగుతోంది.

Telangana Election: ఎనిమిది సార్లు గెలిచిన సీపీఎం కంచుకోటలో కాంగ్రెస్ పాగా.. ఈసారీ త్రిముఖ పోటీ తప్పదా..?
Cpm Congress Brs
Follow us
N Narayana Rao

| Edited By: Balaraju Goud

Updated on: Nov 08, 2023 | 1:28 PM

నాలుగు రాష్ట్రాల సరిహద్దు పూర్తి ఏజెన్సీ నియోజక వర్గం. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు తిరుగులేని విజయాలతో ఎర్రజెండా ఎగిరింది. భద్రాచలం నియోజకవర్గం సీపీఎం పార్టీకి కంచుకోటగా మారింది. ఇప్పుడు మారిన రాజకీయ పరిణామాలతో కొంత పట్టు కోల్పోయింది. అయితే ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఎం పొత్తు కుదరక పోవడంతో, సీపీఎం ఒంటరిగా బరిలోకి దిగుతోంది. సీపీఎంలకు బలమైన ఓటు బ్యాంకు, కేడర్ ఉన్న భద్రాచలంలో.. బీఆర్ఎస్, కాంగ్రెస్ రంగంలో ఉండటంతో త్రిముఖ పోటీ తప్పేలా లేదు..!

భద్రాచలం అంటే సీపీఎం.. సీపీఎం అంటే భద్రాచలం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నియోజక వర్గంలో సీపీఎం చెప్పిందే వేదం. ఒక విధంగా చెప్పాలంటే భద్రాచలం ఏజెన్సీని శాసించింది. ఎనిమిది సార్లు వరుస విజయాలతో తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకుంది. భద్రాచలంలో ఎర్రజెండా రెప రెపలతో కంచుకోటగా మారింది. 1952 లో నియోజక వర్గం ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద నియోజక వర్గంగా ఉండేది. పోలవరం ముంపు మండలాలు వీఆర్‌.పురం, చింతూరు, కూనవరం మండలాలు 2014 వరకు భద్రాచలం నియోజక వర్గంలో ఉండేవి. ఉప ఎన్నికలతో కలుపుకుంటే 16 సార్లు ఎన్నికలు జరిగాయి. 1978, 1983 లో ముర్ల ఎర్రయ్య రెడ్డి సీపీఎం తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు.1985, 1989, 1994లో కుంజా బుజ్జి సీపీఎం తరపున గెలిచారు. ఆ తర్వాత 1999, 2004, 2014ల్లో సున్నం రాజయ్య సీపీఎం తరపున ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించారు. మొత్తం మీద ఎనిమిది సార్లు సీపీఎం పార్టీ విజయ ఢంకా మోగించింది.

ఇపుడు మారిన రాజకీయ పరిణామాల్లో భాగంగా వామపక్షాలు, కాంగ్రెస్ మధ్య పొత్తుల కోసం చర్చలు విఫలమయ్యాయి. ఇద్దరి మధ్య దోస్తీ కటీఫ్ అయ్యింది. సీపీఎం పోటీ చేసే స్థానాలను కాంగ్రెస్ ముందు ప్రతిపాదన పెట్టారు. వాటిలో ఖచ్చితంగా సీపీఎంకు బలమైన నియోజక వర్గం భద్రాచలం ఇస్తేనే..పొత్తులు ఉంటాయని తేల్చి చెప్పారట. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఉన్నారు. సిట్టింగ్ సీటును ఎలా వదులు కుంటామని, అందులోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు పార్టీ పిరాయించి, బీఆర్ఎస్‌లో చేరడంతో పొదెం వీరయ్య ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, పార్టీ మారకుండా కాంగ్రెస్ లోనే కొనసాగుతూ వస్తున్నారు. అలాంటి నేతను వదులుకోబోమని, కాంగ్రెస్ తరపున పొదెం వీరయ్య పోటీ చేస్తారని అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో భద్రాచలం లాంటి బలమైన సీటు ను వదులు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత పాలేరుపై పట్టు పట్టినా.. అది కూడా సాధ్యం కాలేదు.

ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా 17 స్థానాలకు సీపీఎం తమ అభ్యర్థులను ఖరారు చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు సీట్లలో పోటీ చేస్తోంది. భద్రాచలం నుంచి సీపీఎం అభ్యర్థిగా కారం పుల్లయ్యను అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పోడెం వీరయ్య, బీఆర్ఎస్ నుంచి తెల్లం వెంకట్రావు, దీంతో భద్రాచలంలో త్రిముఖ పోటీ నెలకొంది. గత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పోడెం వీరయ్యకు 47,446 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావుకు 35,961 ఓట్లు, సీపీఎం అభ్యర్థి మిడియం బాబురావుకు 14,224 ఓట్లు పోలయ్యాయి. 11,554 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి పోడెం వీరయ్య విజయం సాధించారు.

ఈ లెక్కలు బట్టి చూస్తే.. భద్రాచలంలో ఏదో ఒక పార్టీ గెలుపు ఓటములను ప్రభావితం చేయగలిగే స్థితిలో సీపీఎం ఓటు బ్యాంకు ఉందని స్పష్టమవుతోంది. పొత్తు ఉంటే కాంగ్రెస్ గెలుపు అవకాశం సునాయాసం. ఇపుడు..లెక్కలు ఎలా మారతాయి. సీపీఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీతో ఓట్ల చీలిక జరిగి, ఏదో ఒక పార్టీ విజయ అవకాశాలను దెబ్బతీస్తుందా..? అన్నది పార్టీల నేతలు చర్చించుకుంటున్నారు. భద్రాచలంలో మారిన పరిణామాలతో చివరికి గెలుపు ఎవరిని వరిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..