Telangana Election: 26 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.. ఎవరా ఇద్దరు.. ఏమా కథ..?

| Edited By: Balaraju Goud

Nov 08, 2023 | 10:47 AM

రాజకీయాలకు యువత రావాలి అంటూ తరచుగా నేతల ప్రసంగాల్లో మనం వింటూనే ఉంటాం..! కానీ రాజకీయ పార్టీల్లో అలాంటి వాతావరణం కనిపించదు. అయితే ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ 30 ఏళ్ల లోపు ఉన్నవారికి ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం వచ్చింది. ఆ ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నుంచే బరిలో దిగుతున్నారు. ఎవరు ఆ ఇద్దరు ఎంటి వారి నేపథ్యం..

Telangana Election: 26 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.. ఎవరా ఇద్దరు.. ఏమా కథ..?
Mynampally Rohit Rao ,humandla Yashaswini Reddy
Follow us on

రాజకీయాలకు యువత రావాలి అంటూ తరచుగా నేతల ప్రసంగాల్లో మనం వింటూనే ఉంటాం..! కానీ రాజకీయ పార్టీల్లో అలాంటి వాతావరణం కనిపించదు. యువతను ప్రోత్సహించి వారిని చట్టసభలోకి పంపే అవకాశం చాలా అరుదుగానే జరుగుతుంటాయి. ఉద్యమ పార్టీగా 14 ఏళ్లు పోరాటం చేసిన BRS రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఉద్యమంలో పనిచేసిన యువకులు ఎందరికో అసెంబ్లీ ఎన్నికలో పోటీ చేసే అవకాశం కల్పించింది. ముఖ్యంగా చెన్నూర్ ఎమ్మెల్యే బాల్కా సుమన్, తుంగతుర్తి ఎమ్మెల్యే కిషోర్ లాంటి యువ నాయకులకు సీట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా గెలిపించుకుని వారిని ప్రోత్సహించింది.

కాంగ్రెస్ కూడా గతంలో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన వంశీ చందర్ రెడ్డికి 2014 టికెట్ ఇచ్చింది. వీళ్లంతా కూడా 30 ఏళ్లు దాటిన తర్వాతే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసే అవకాశం లభించింది. గతంలో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు పెద్ద సంఖ్యలో యువకులకు సీట్లు లభించాయి. మోత్కుపల్లి నరసింహులు, చింతకాయల అయ్యన్నపాత్రుడు వంటి యువ నాయకులు 30 ఏళ్ల లోపే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. కొంతమంది నాయకులు అయితే ఎమ్మెల్యేలు అయిన తర్వాత పెళ్ళిళ్లు చేసుకున్నారు.

అయితే ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ 30 ఏళ్ల లోపు ఉన్నవారికి ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం వచ్చింది. ఆ ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నుంచే బరిలో దిగుతున్నారు. ఎవరు ఆ ఇద్దరు ఎంటి వారి నేపథ్యం..

మైనంపల్లి రోహిత్ రావు

సీనియర్ నాయకుడు, ప్రస్తుత మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కుమారుడు మైనంపల్లి రోహిత్. గత కొంతకాలంగా మెదక్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని బీఆర్ఎస్ పార్టీలో తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. కానీ మెదక్ టికెట్ ఆయనకు లభించకపోవడంతో అలిగిన తండ్రి.. నా కొడుకు టికెట్ ఇవ్వని పార్టీలో ఉండనంటూ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిపోయారు. దీంతో తండ్రి కొడుకులను చేరదీసిన హస్తం పార్టీ మెదక్ సీటును రోహిత్‌కు, మల్కాజిగిరి సీటును హనుమంతరావుకు కేటాయించింది. అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన రోహిత్ వయసు 26 ఏళ్లు మాత్రమే. ఈసారి తెలంగాణ శాసనసభకు నించున్న అభ్యర్థులందరిలో అత్యంత చిన్న వయసు రోహిత్ కావడం విశేషం.

హనుమాండ్ల యశస్విని రెడ్డి

1985 నుంచి ఇప్పటివరకు ఎన్నికల్లో ఓటమంటే ఎరుగని.. 37 ఏడేళ్లగా ఎమ్మెల్యే, మంత్రిగా అనుభవం ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావుపైన, ఈసారి 26 ఏళ్ల అమ్మాయికి సీటు కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి ఇక్కడి సీటు ఈ అమ్మాయికి కాకుండా, వాళ్ల అత్తగారైన ఝాన్సీ రెడ్డికి రావాల్సింది. కాన, ఆమె ఎన్నారై కావడం, భారత పౌరసత్వం కోసం పెట్టిన అప్లికేషన్ ముందుకు కదలకపోవడంతో, రానున్న రోజుల్లో ఇబ్బందులు రాకుండా యశస్విని రెడ్డిని నిల్చబెట్టారు ఝాన్సీ రెడ్డి. ఈమె వయసు కూడా 26 ఏళ్ళు. కాకపోతే రోహిత్ కన్నా కొన్ని నెలలు పెద్దది.

అయితే వీరిద్దరూ వయసులో చిన్న అయినప్పటికీ.. వారికి ఉన్న బ్యాక్ గ్రౌండ్ వల్లే సీటు వచ్చింది అన్నదీ అక్షర సత్యం. కానీ నిజంగా పోరాటాలు చేసి పార్టీ ఆర్గనైజేషన్‌లో పనిచేసిన వారికి ఇంత తొందరగా సీటు లభించదు. ఉదాహరణ చాలామంది ఉన్నారంటూ చర్చ జరుగుతోంది. అత్యంత చిన్న వయసులోనే సీటు సాధించిన ఇద్దరు గెలుస్తారా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…