Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Election 2023: ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసులు.. 2018 తో పోలిస్తే ఎంత పెరిగాయో తెలుసా..?

Telangana Assembly Election 2023: తెలంగాణలో ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల నామినేషన్లలో 119 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు తమపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలు వెల్లడించారు. మొత్తం 119 నియోజకవర్గాల్లో అన్ని పార్టీల అభ్యర్థులు తమ నేర చరిత్రను బహిర్గతం చేశారు. అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను పరిశీలిస్తే అందరికంటే ముందుగా అధికార బీఆర్ఎస్ పార్టీ 119 మంది అభ్యర్థుల్లో దాదాపు 56 మంది ఎమ్మెల్యేల పైన క్రిమినల్ కేసులు ఉన్నట్టు ప్రకటించింది.

Telangana Election 2023: ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసులు.. 2018 తో పోలిస్తే ఎంత పెరిగాయో తెలుసా..?
BRS - Congress - BJP
Follow us
Vijay Saatha

| Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 16, 2023 | 8:51 PM

Telangana Assembly Election 2023: తెలంగాణలో ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల నామినేషన్లలో 119 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు తమపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలు వెల్లడించారు. మొత్తం 119 నియోజకవర్గాల్లో అన్ని పార్టీల అభ్యర్థులు తమ నేర చరిత్రను బహిర్గతం చేశారు. అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను పరిశీలిస్తే అందరికంటే ముందుగా అధికార బీఆర్ఎస్ పార్టీ 119 మంది అభ్యర్థుల్లో దాదాపు 56 మంది ఎమ్మెల్యేల పైన క్రిమినల్ కేసులు ఉన్నట్టు ప్రకటించింది. నేర చరిత్ర ఉన్న అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడంపై సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అధికారికంగా పత్రికల్లో కేసుల వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది.. ఇప్పటికే అధికారిక బీఆర్ఎస్ పార్టీ తమ 56 మంది ఎమ్మెల్యేల పైన ఉన్న కేసులు వివరాలను పత్రికా ముఖంగా ప్రకటించింది.

ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు ప్రకటిస్తున్న క్రిమినల్ కేసుల వివరాలు పరిశీలిస్తే.. ఈసారి ప్రతిపక్ష అభ్యర్థుల పై కూడా ఎక్కువ కేసులు ఉన్నట్టు తెలుస్తుంది. అధికారికంగా పత్రికా ముఖంగా ప్రతిపక్షాలు తమ పార్టీ అభ్యర్థుల నేర చరిత్రను వెల్లడించనప్పటికీ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లలో ఒక్కొక్కరు తమపై ఉన్న చరిత్రను బహిర్గతం చేశారు. 2018 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే 2023 నాటి ఎన్నికలకు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ నాయకులపైన అమాంతంగా క్రిమినల్ కేసులు పెరిగిపోయాయి.

2018 నాటికి వీరిపై కేవలం పదుల సంఖ్యలో కేసులో నమోదు అయితే, తాజాగా అభ్యర్థులను దాఖలు చేసిన అఫిడవిట్ల ప్రకారం ఒక్కో ప్రతిపక్ష నాయకుడిపై 50 శాతానికి పైగా కేసులు పెరిగాయి. ఉదాహరణకు రేవంత్ రెడ్డిపై 2018లో 42 క్రిమినల్ కేసులు ఉంటే.. 2023 ఎన్నికల సందర్భంగా దాఖాలు చేసిన అఫిడవిట్లో తనపై 89 కేసులు ఉన్నట్టు ప్రకటించారు.

ఇక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై 2018లో 43 కేసులు ఉంటే.. 2023 నాటికి వాటి సంఖ్య 89 గా మారింది.. బిజెపి మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పై గత ఎన్నికల్లో 6 కేసులు ఉంటే.. నాలుగు సంవత్సరాల్లో బండి సంజయ్ పై 53 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుత అఫిడవిట్ ప్రకారం.. బండి సంజయ్ పై 59 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. మరో బీజేపీ నేత ధర్మపురి అరవింద్‌పై గత ఎన్నికల్లో కేవలం ఒక్క కేసు మాత్రమే ఉంది. 2023 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ధర్మపురి అరవింద్ పై ప్రస్తుతం 17 కేసులు పెండింగ్‌‌లో ఉన్నాయి. దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పై గతంలో ఒక్క కేస్ కూడా లేదు. ప్రస్తుత అఫిడవిట్ ప్రకారం.. రఘునందన్ రావు పై 27 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈటల రాజేందర్ పై గత ఎన్నికల్లో కేవలం 3 కేసులు ఉండగా ఈ ఎన్నికలకు వాటి సంఖ్య 40 కు చేరింది.

అయితే, గత ఎన్నికలతో పోలిస్తే అధికార బీఆర్ఎస్ కి సంబంధించిన అభ్యర్థులపై మాత్రం క్రిమినల్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. సీఎం కేసీఆర్ నుంచి మొదలుకుని మారుమూల నియోజకవర్గ అభ్యర్థి వరకు చాలామందిపై ఉన్న క్రిమినల్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అయితే, 2018లో ఏర్పడిన ప్రజాప్రతినిధుల కోర్టులో ఎమ్మెల్యేల కేసుల విచారణ సందర్భంగా చాలా కేసులు వీగిపోయాయి.

2023 ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్లను పరిశీలిస్తే.. 119 నియోజకవర్గాల్లో 56 నియోజకవర్గాల అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అయితే 2018 ఎన్నికల్లో 59 మంది బీఆర్ఎస్ అభ్యర్థులపై కేసులు ఉండేవి. 2023 నాటికి బిఆర్ఎస్ కు చెందిన 56 మంది అభ్యర్థులపై కేసులు ఉన్నట్టు బిఆర్ఎస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. అయితే గతంతో పోలిస్తే ఒక్కో అభ్యర్థిపై ఉన్న కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. సీఎం కేసీఆర్ పై 54 కేసులు ఉండగా తాజా అఫిడవిట్ ప్రకారం.. సీఎం కేసీఆర్ పై 9 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

మంత్రి కేటీఆర్‌పై గతంలో 16 కేసులు పెండింగ్‌లో ఉండగా 2023 ప్రకారం కేటీఆర్ పై ఏడు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మంత్రి హరీష్ రావు పై గతంలో 39 కేసులు ఉండగా, తాజా అఫిడవిట్ ప్రకారం మంత్రి హరీష్ రావు పై కేవలం మూడు కేసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఎక్కువ క్రిమినల్ కేస్‌లు ఉన్న బిఆర్ఎస్ అభ్యర్థులలో గంగుల కమలాకర్ పై 10 కేసులు, పాడి కౌశిక్ రెడ్డిపై 4, సబితా ఇంద్రారెడ్డిపై 5, సైదిరెడ్డిపై 5, ఎర్రబెల్లి దయాకర్ రావు పై 3 కేసులు, చల్లా ధర్మారెడ్డి పైన 4 కేసులు, నోముల భగత్ పై 3, పట్నం నరేందర్ రెడ్డి పై రెండు కేసులు, పైలెట్ రోహిత్ రెడ్డి పై రెండు కేసులు, దానం నాగేందర్ పై రెండు కేసులు పెండింగ్ లో ఉన్నాయి.

అయితే, క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడంపై ఆయా పార్టీలు అధికారికంగా పత్రికా ముఖంగా తెలపాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పునిచ్చింది. 2018 లోనే సుప్రీంకోర్టు దీనిపై ఆదేశాలు జారీ చేసింది. 2018 ఎన్నికలకు క్రిమినల్ కేసులో ప్రకటనపై పార్టీలు పెద్దగా పట్టించుకోనప్పటికీ 2023 ఎన్నికలకు మాత్రం ఎలక్షన్ కమిషన్ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. దీంతో అధికారిక బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తమ 56 మంది ఎమ్మెల్యేలపై ఉన్న కేసులు వివరాలను పత్రికాముఖంగా నవంబర్ 11న ప్రచురించింది. ఆ పార్టీ జనరల్ సెక్రెటరీ సోమా భరత్ పేరుతో అభ్యర్థులపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను ప్రకటించారు. మిగతా పార్టీలు కూడా తమ క్యాండిడేట్లపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలు ప్రకటించాలి. నిబంధనలు ప్రకారం పత్రికలలో మూడుసార్లకు తగ్గకుండా అభ్యర్థుల నేరచరిత్ర పై పార్టీలు ప్రకటించాల్సి ఉంటుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..