Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉగాది ఉత్సవంలో బోనాల జాతర.. షడ్రుచుల పచ్చడితో పాటే చుక్కా.. ముక్కా విందు..! ఎక్కడో కాదండోయ్..

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది అంటే.. గుర్తుకు వచ్చేది షడ్రుచుల పచ్చడి. తెలుగు సంవత్సరాది. సాధారణంగా ఉగాది రోజున ప్రతి ఇంట్లో షడ్రుచులతో కూడిన పచ్చడి, బక్ష్యాలు, పూర్ణాలు, పులిహోర, పిండి వంటకాలు, మామిడి తోరణాలు, పంచాంగ శ్రవణంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడలేని విధంగా ఉగాది పచ్చడితో పాటు మందు, మాంసాలు, ముత్యాలమ్మకు బోనాలు, ఎడ్లబండ్లు, వాహనాల ప్రదర్శనలతో ఇక్కడి గ్రామస్తులు పండుగ జరుపుకుంటారు. వందేళ్లకు పైగా ఈ సంప్రదాయాన్ని ఇక్కడి గ్రామస్తులు కొనసాగిస్తున్నారు. ఈ వెరైటీ సంప్రదాయం ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

ఉగాది ఉత్సవంలో బోనాల జాతర.. షడ్రుచుల పచ్చడితో పాటే చుక్కా.. ముక్కా విందు..! ఎక్కడో కాదండోయ్..
Unique Ugadi In Motkur
Follow us
M Revan Reddy

| Edited By: Jyothi Gadda

Updated on: Mar 30, 2025 | 3:31 PM

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా యాదాద్రి జిల్లా మోత్కూరులో ఉగాది వేడుకలను భిన్నంగా జరుపుకుంటారు. ఇక్కడ ఉగాది వేడుకలను షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి తోపాటు నాన్ వెజ్ వంటకాలతో మందు, మాంసాలు, ముత్యాలమ్మలకు బోనాలు, ఎడ్ల బండ్లు, వాహనాల ప్రదర్శనలతో ఆనందోత్సాహాలతో ఉగాది వేడుకలను ఎంజాయ్ చేస్తుంటారు. వందేళ్లకు పైగా ఈ వెరైటీ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

ఉగాది పచ్చడితోపాటు చుక్కా, ముక్కా…

ఉగాది పండుగ రోజున గ్రామస్థులంతా షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడితో పాటు తూర్పున(చెరువు కట్ట) ముత్యాలమ్మ, పడమర (అంగడిబజారు) ముత్యాలమ్మకు యాటలు, కోళ్లు బలి ఇస్తారు. అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించి శాకలు పోస్తారు. ఉగాది ముందురోజు రాత్రి మహిళలు భక్తి శ్రద్ధలతో చలి బోనాలు వండుతారు. రైతులు తమ ఎడ్ల బండ్లను, వాహనాలు శుభ్రం చేసుకుని రకరకాల పూలతో అలంకరిస్తారు.

ఇవి కూడా చదవండి

ముత్యాలమ్మకు బోనాలు, ఎడ్లబండ్ల ప్రదర్శన..

ఉగాది రోజున ఆ బోనాలను పసుపు, కుంకుమ, వేప మండలతో అలంకరిస్తారు. ఉదయం ప్రజలంతా ఉగాది పచ్చడితో పాటు మందు, మాంసాలతో విందు భోజనాలు చేస్తారు. మధ్యాహ్నం సమయంలో గ్రామ మహిళలంతా బోనాలు ఎత్తుకుని డప్పుచప్పుళ్లతో ఊరేగింపుగా హైస్కూల్ ఆవరణలోకి వెళతారు. రైతులు తమ ఎడ్ల బండ్లను, వాహనదారులు బైకులు, ఆటోలు, డీసీఎంలు, లారీలు, జీపులు వంటి వాహనాలను బోనాల చుట్టూ తిప్పుతారు. ఇక్కడ ఎడ్ల బండ్లు, వాహనాల ప్రదర్శనలు పోటాపోటీగా నిర్వహిస్తారు. యువత బైకులతో విన్యాసాలు చేస్తారు. మూడు గంటల పాటు ఈ ప్రదర్శనలు జరుగుతాయి. తర్వాత గ్రామ మహిళలంతా బోనాలతో హైస్కూల్ ఆవరణ నుంచి నేరుగా ముత్యాలమ్మ ఆలయాలకు వెళ్లి అమ్మవార్లకు నైవేధ్యం సమర్పిస్తారు. ఏడాదిపాటు పాడిపంటలు పిల్లాపాపలను చల్లగా చూడాలంటూ అమ్మవార్లను వేడుకుంటారు.

ఆ తర్వాత గ్రామంలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో పండితులు నిర్వహించే పంచాంగ శ్రవణంతో వేడుకలను ముగిస్తారు. ఈ వెరైటీ ఉగాది వేడుకలను మోత్కూరుతోపాటు మున్సిపాలిటీ పరిధిలోని జామచెట్లబావి, కొండాపురం, ఆరెగూడెం గ్రామాల ప్రజలు ఈ భిన్నమైన ఉగాదిని జరుపుకుంటారు.

ఉగాది వేడుకలను మార్చేసిన మశూచి వ్యాధి…

మోత్కూరు పరిసర ప్రాంతాల్లో వందేళ్లు క్రితం వేసవిలో పెద్ద ఎత్తున ప్రజలకు అమ్మవారు (మసూచి) సోకి చనిపోయారు. గ్రామంలో తూర్పున, పడమర కొలువై ఉన్న ముత్యాలమ్మ తల్లికి మొక్కులు చెల్లించకపోవడం వల్లే అమ్మవారి ఆగ్రహంతో ప్రజలు అమ్మవారు సోకి చనిపోతున్నారని గ్రామ ప్రజలు భయపడ్డారు. దీంతో ఉగాది పర్వదినం రోజున ఊరంతా ముత్యాలమ్మలకు బోనాలు చేసి, జంతు బలి ఇచ్చి అమ్మవార్లకు శాంతింపజేశారు. అప్పటి నుంచి గ్రామంలో అమ్మవారు(మసూచి) మాయమై పోయిందని గ్రామ పెద్దలు చెబుతుంటారు. దీంతో ఆనాటి నుంచి నేటి వరకు వందేళ్ళకు పైగా మోత్కూరులో చుక్కా ముక్క సంప్రదాయం కొనసాగుతూ వస్తున్నారు. క్రోధినామ సంవత్సరానికి వీడ్కోలు తెలుపుతూ విశ్వావసు నామ వత్సరానికి స్వాగతం పలికారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..