CM KCR: 111 జీవోపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు!
111 జీవోపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం కేసీఆర్ సమాధానం ఇచ్చారు.
CM KCR on Go No.111: 111 జీవోపై తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం శాసనసభ(Assembly)లో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. ఎక్స్‌పర్ట్ కమిటీ(Experts Committee) నివేదికరాగానే 111 జీవోను ఎత్తివేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో 111 జీవో అర్థరహితం అన్న కేసీఆర్.. దీనిపై అధ్యయనం చేసేందుక నిపుణులు కమిటీని ఏర్పాటు చేశామన్నారు. పూర్తి స్థాయి నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామన్నారు. అయితే, ప్రస్తుతం 111 జీవో పరిధిలో 1,32,600 ఎకరాల భూమి ఉందని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. గతంలో హైదరాబాద్ మహానగర దాహార్తిని తీర్చే జంట జలాశయ పరిరక్షణ కోసం ఈ జీవో తీసుకువచ్చారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. హైదరాబాద్‌కు ఈ జలాశయాల నీరు ప్రస్తుతం అవసరం లేదన్నారు. నగరవాసులకు నీటి కష్టాలను తీర్చేందుకు గోదావరి, కృష్ణా జలాలు సరిపోతున్నాయన్నారు. ఇంకో 100 ఏళ్ల వరకు హైదరాబాద్‌కు నీటికొరత లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
111 జీవో పరిధిలో 1,32,600 ఎకరాల భూమి ఉందన్న కేసీఆర్.. జంట జలాశయ పరిరక్షణ కోసమే ఈ జీవో ఇచ్చారన్నారు. హైదరాబాద్‌కు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల నీళ్లతో అవసరం లేదన్నారు. కృష్ణా, గోదావరి జలాలు పుష్కలంగా ఉన్నాయని.. మరో 100 ఏళ్ల వరకు హైదరాబాద్‌కు నీటి కొరత రాబోదన్నారు సీఎం.మహానగరం మంచినీటి సరఫరాలో కీలకంగా వుండే హిమాయత్‌సాగర్, ఉస్మాన్ సాగర్ పరివాహాక ప్రాంతాలను మాస్టర్ ప్లాన్‌లో హెచ్‌ఎండీఏ బయో కన్జర్వేజన్ జోన్‌గా ప్రకటించింది. ఈ జంట జలాశయాలను రక్షించే ఉద్దేశంతో 25 ఏళ్ల కింద ఈ 111 జీవో ఇచ్చారు. రంగారెడ్డి జిల్లాలోని 6 మండలాలు, మహబూబ్‌నగర్ జిల్లాలోని 2 గ్రామాలు ఈ జీవో పరిధిలో ఉన్నాయి.
రెండు జలాశయాలను రక్షించేందుకు శంషాబాద్, మెయినాబాద్, రాజేంద్రనగర్, శంకర్‌పల్లి, చేవెళ్ల, షాబాద్ మండలాల్లోని 84 గ్రామాల్లో నిర్మాణాలను నిషేధిస్తూ 111 జీవోను చంద్రబాబునాయుడు ప్రభుత్వం 1996లో జారీ చేసింది. వరద నీరు సులువుగా ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలకు చేరాలనేది ఈ జీవో ముఖ్య ఉద్దేశం. కాలుష్య వ్యర్థాలను నివారించడం కోసం కాలుష్య కారక పరిశ్రమలు, భారీ నివాస భవనాలు, పెద్ద హోటళ్ల నిర్మాణాలపై ఆ జీవో ప్రకారం ఆంక్షలు విధించారు. ఈ ప్రాంతాల్లో కొత్తగా వెంచర్లు వేయడం, అపార్ట్‌మెంట్ల నిర్మాణం నిషేధం. నిషేధిత ప్రాంతాల్లోని వెంచర్లు, నిర్మాణాలను రిజిస్ట్రేషన్ చేసే అవకాశాల్లేవు. కేవలం వ్యవసాయ భూములు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలశయాలకు ఎగువన 10 కిలోమీటర్ల విస్తీర్ణంలోని మొయినాబాద్, శంషాబాద్, శంకర్‌పల్లి, కొత్తూరు, షాబాద్ మండల్లాలోని 84 గ్రామాలను ఈ జీవో కిందకు తెచ్చారు. భూమిని కేవలం వ్యవసాయానికే ఉపయోగించుకోవాలి. నీటి కాలుష్యానికి కారణమయ్యే ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా చట్టప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు జీవో 111 జారీ చేసినప్పటికీ అది సక్రమంగా అమలు కావడం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇక్కడ యథేచ్ఛగా వెంచర్లు వేస్తున్నారు. జాతీయ రహదారికి సమీపంలో వుండటంతో పలువురు సంపన్నులు ఇక్కడ గెస్ట్ హౌస్‌లు, ఫామ్ హౌస్‌లు నిర్మించుకున్నారు. ఈ ఉల్లంఘనలపై కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. తాజాగా 111 జీవో మనుగడపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జంట జలాశయాల కోసం తీసుకొచ్చిన ఈ జీవోను రద్దు చేయబోతున్నట్టు చెప్పారు సీఎం. కృష్ణా, గోదావరి జలాల రాకతో జంట జలాశయాల అవసరం హైదరాబాద్‌కు లేకుండా పోయింది. ఇక ఆ జీవోతో పనేముందన్నది కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు.