Telangana Assembly Sessions Live Updates: తొమ్మిదో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. నైట్ కర్ఫ్యూపై ప్రకటన?

Telangana Assembly Sessions Live Updates: తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు తొమ్మిదో రోజు ప్రారంభ‌మ‌య్యాయి. గురువారం శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా స‌భ్యులంద‌రూ...

Telangana Assembly Sessions Live Updates: తొమ్మిదో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. నైట్ కర్ఫ్యూపై ప్రకటన?
Ts Assembly Live

Edited By:

Updated on: Mar 25, 2021 | 5:41 PM

Telangana Assembly Sessions Live Updates: తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు తొమ్మిదో రోజు ప్రారంభ‌మ‌య్యాయి. గురువారం శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా స‌భ్యులంద‌రూ కొవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని స్పీక‌ర్ విజ్ఞప్తి చేశారు. ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రారంభ‌మైన స‌మావేశాల్లో స్పీక‌ర్ ప్రశ్నోత్తరాల‌ను చేప‌ట్టారు. ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంట‌నే బ‌డ్జెట్ ప‌ద్దుల‌పై చ‌ర్చ ప్రారంభించ‌నున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 15న ప్రారంభ‌మైన అసెంబ్లీ స‌మావేశాలు శుక్రవారంతో ముగియ‌నున్నాయి.
గత రెండు రోజులుగా 26 పద్దులపై చర్చించి వాటిని ఆమోదించారు. ఇవాళ నీటిపారుదల, సాధారణ పరిపాలన, కార్మికశాఖ, ఉపాధి కల్పన, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, రోడ్లు, భవనాలు, విద్యుత్‌, శాసన, న్యాయ, ప్రణాళిక శాఖలపై చర్చించనున్నారు. వీటితోపాటు సవరణల బిల్లులు కూడా అసెంబ్లీలో చర్చకు రానున్నాయి. ఇందులో ఉద్యోగుల వయో పరిమితి పెంపు సవరణ బిల్లు, వేతనాలు, పింఛన్ల చెల్లింపునకు సంబంధించిన సవరణల బిల్లులు ఉన్నాయి.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 25 Mar 2021 02:49 PM (IST)

    రాష్ట్రంలో పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి సత్యవతి రాథోడ్‌

    తెలంగాణలో పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. మంత్రివర్గం,అధికారుల సమేతంగా ముఖ్యమంత్రి కేసీఆర్ క్షేత్రస్థాయి పర్యటన చేసి పోడు భూముల సమస్యలను పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. అంత వరకు పోడు భూములు జోలికి వెళ్లవద్దని గిరిజన రైతులను ఇబ్బంది పెట్టవద్దని తెలిపారు. త్వరలోనే పోడు భూముల సమస్యకు సీఎం కేసీఆర్ సమగ్రమైన పరిష్కారం చూపుతామని ఆమె తెలిపారు. శాస‌న‌స‌భ‌లో ప్రశ్నోత్తరాల సంద‌ర్భంగా రాష్ట్రంలో గిరిజన రైతుల పోడు భూముల సమస్యలపై స‌భ్యులు అడిగిన ప్రశ్నల‌కు మంత్రి స‌త్యవ‌తి స‌మాధానం ఇచ్చారు

  • 25 Mar 2021 12:47 PM (IST)

    తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన మంత్రి హరీష్ రావు.. త్వరలోనే 50వేల ఉద్యోగాలు..

    Harish Rao

    తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు శుభవార్త తెలిపారు. రాష్ట్రంలో త్వరలో 50 వేల ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు మంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. తొమ్మిదో రోజు జరుగుతోన్న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో హరీశ్‌ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక గురువారం తెలంగాణ అసెంబ్లీ పలు బిల్లులకు ఆమోదం తెలిపింది. ముఖ్యంగా ఉద్యోగ విరమణ వయోపరిమితిని 61 ఏళ్లకు పెంపు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పింఛను పెంపు బిల్లుకు శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా హరీశ్‌ రావు మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో 50వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని సీఎం నిర్ణయించారు. త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేస్తాం’’ అని హరీశ్‌ రావు తెలిపారు.


  • 25 Mar 2021 11:51 AM (IST)

    వయో పరిమితి పెంపు సవరణ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం..

    రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వ‌యో ప‌రిమితి పెంపు స‌వ‌ర‌ణ బిల్లుకు శాస‌న‌స‌భ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సంద‌ర్భంగా ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు మాట్లాడుతూ.. ‘రాష్ర్టంలో ప్రభుత్వ ఉద్యోగుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు 58 ఏళ్లుగా ఉంది. ప్రస్తుతం రాష్ర్టంలో 4వ త‌ర‌గ‌తి ఉద్యోగుల‌కు రిటైర్డ్ వ‌య‌సు 60 ఏళ్లు, ప్రభుత్వ వైద్య క‌ళాశాల‌ల్లో బోధ‌న సిబ్బందికి ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు 65 ఏళ్లుగా ఉంది. అయితే న్యాయ‌ సిబ్బందికి రిటైర్డ్ వ‌య‌సు 60 ఏళ్లుగా ఉంది. మన దేశంలోని కొన్ని రాష్ర్టాల్లో ప్రభుత్వ ఉద్యోగుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు 60, 62 ఏళ్లుగా ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేర‌కు సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సును 58 నుంచి 61 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నార’ని మంత్రి చెప్పుకొచ్చారు. ఉద్యోగుల అనుభావాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు హరిష్‌ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు.

  • 25 Mar 2021 10:59 AM (IST)

    రైతు వేదికల నిర్మాణాల కోసం రూ.572 కోట్లకుపైగా ఖర్చు చేశాం: మంత్రి నిరంజన్‌ రెడ్డి.

    తెలంగాణలో ఇప్పటి వరకు 2,596 రైతు వేదికలు నిర్మించామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. శాస‌న‌స‌భ‌లో ప్రశ్నోత్తరాల సంద‌ర్భంగా రైతు వేదిక‌ల నిర్మాణంపై స‌భ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ.. రైతు వేదిక‌ల నిర్మాణాల కోసం రూ. 572 కోట్ల 22 ల‌క్షల మొత్తాన్ని ఖ‌ర్చు చేశామ‌ని చెప్పుకొచ్చారు. వ్యవసాయం, అనుబంధ శాఖ‌ల ద్వారా ఆధునిక వ్యవ‌సాయ సమాచారం, అవ‌గాహ‌న క‌ల్పించ‌డం కోసం, నైపుణ్య శిక్షణా కేంద్రాలుగా ఈ వేదిక‌ల‌ను ఉప‌యోగిస్తామ‌న్నారు.

  • 25 Mar 2021 10:55 AM (IST)

    పేద ప్రజలకు మెరుగైన ఆరోగ్యం అందించడమే లక్ష్యంగా: ఈటల రాజేందర్‌

    పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లను ఏర్పాటు చేశామని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్ధారణ కేంద్రాల ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కొన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న డయాగ్నోస్టిక్‌ సౌకర్యాలకు అదనంగా జిల్లా ఆసుపత్రుల్లో కొత్తగా సేవలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్‌, సిద్దిపేట జిల్లా కేంద్రాల్లో రెండు సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ల్యాబ్‌ల‌లో 60 ర‌కాల ప‌రీక్షలు చేస్తున్నారని… ఈ ఏడాది ఏప్రిల్ నాటికి జిల్లా ఆస్పత్రుల్లో మ‌రో 18 డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్లను ఏర్పాటు చేస్తామ‌ని చెప్పుకొచ్చారు.