Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ అలర్ట్.. మూడ్రోజుల పాటు వర్షాలే.. వెదర్ అప్డేట్ ఇదిగో..
ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ వర్షసూచన జారీ చేసింది. రాబోయే మూడ్రోజుల్లో వానలు పడతాయని హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని తెలిపింది. అయితే ఎల్‌నివో ప్రభావం వల్ల లోటు వర్షపాతం నమోదవుతోంది. కొన్ని జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.

రుతుపవన ద్రోణి ఈరోజు సగటు సముద్ర మట్టం వద్ద అమృత్‌సర్, ముజఫర్‌నగర్, కాన్పూర్, ఈశాన్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలోని అల్పపీడన కేంద్రం, డాల్టన్‌గంజ్, దిఘా మీదుగా ప్రయాణిస్తూ.. అక్కడి నుండి ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఆంధ్రప్రదేశ్ – దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ మేరకు తాజాాగా వెదర్ బులిటెన్ విడుదల చేసింది. ఈరోజు, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో క్రింది స్థాయి గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
తెలంగాణలో లోటు వర్షపాతం
అయితే ఇప్పటికే తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడుతున్నాయి. అయితే గత ఏడాది కంటే ఈ సారి లోటు వర్షపాతం నమోదవుతోంది. ఎల్‌నివో ప్రభావంతో వర్షాలు పెద్దగా పడటం లేదు. దీంతో అన్నదాతలు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. గత ఏడాది కంటే సాధారణ వర్షపాతం 20 శాతం కంటే ఎక్కువ తగ్గింది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఎలా ఉన్నాయో దీనిని బట్టి తెలుస్తోంది. రాబోయే రోజుల్లో కూడా వర్షాలు పెద్దగా ఉండకపోవచ్చని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
ఏపీలో వర్షాలు
అటు ఏపీలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. ఉత్తర, దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో రాబోయే మూడ్రోజుల పాటు రాష్ట్రంలో వానలు పడతాయని అమరావతి వాతావరణశాఖ స్పష్టం చేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్న క్రమంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.
