డ్రైవర్‌ను అడ్డం పెట్టుకుని కూతురు అకౌంట్‌కు లంచాలు.. మైనింగ్ అధికారి గుట్టురట్టు చేసిన ఏసీబీ..
అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇసుక కాంట్రాక్టర్ల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న మైనింగ్ అధికారి జయరాజు గుట్టును ఏసీబీ రట్టు చేసింది. డ్రైవర్‌ను అడ్డం పెట్టుకుని కుమార్తె బ్యాంక్ ఖాతాకు రూ.లక్షల్లో లంచాలు బదిలీ చేయించిన వ్యవహారం అధికారులనే విస్తుపోయేలా చేసింది. ఏసీబీ సోదాల్లో ఏం బయటపడ్డాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో తెలంగాణ గనుల శాఖ అధికారి బి.జయరాజుపై ఏసీబీ కొరడా ఝళిపించింది. గురువారం జయరాజుతో పాటు ఆయన బంధువులు, సన్నిహితులకు చెందిన మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో ఆకస్మిక సోదాలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో భారీగా స్థిర, చర ఆస్తులను అధికారులు గుర్తించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న బి.జయరాజు.. ప్రస్తుతం వరంగల్ డిప్యూటీ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పదవిని అడ్డం పెట్టుకుని భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు వచ్చిన పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు.
సోదాల్లో బయటపడ్డ ఆస్తుల వివరాలు
నిర్వహించిన సోదాల్లో ఇప్పటివరకు సుమారు రూ.3.06 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది. బయటపడిన వాటిలో జీ+2 అంతస్తుల భవనం, ఒక అపార్ట్‌మెంట్ ఫ్లాట్ ఐదు ఓపెన్ ప్లాట్లు, 3.21 ఎకరాల వ్యవసాయ భూమి, రూ.10 లక్షల నగదు, 629 గ్రాముల బంగారు ఆభరణాలు, మూడు లగ్జరీ కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాల్లో రూ. 20.86 లక్షలు, మూడు బ్యాంకు ఖాతాల్లో రూ. 71.27 లక్షల నగదు నిల్వలు ఉన్నాయి.
డ్రైవర్ ఖాతా ద్వారా కుమార్తెకు ముడుపుల మళ్లింపు
ఈ సోదాల్లో అత్యంత కీలకమైన అక్రమ లావాదేవీల నెట్‌వర్క్ వెలుగుచూసింది. జయరాజు వ్యక్తిగత డ్రైవర్ మొబైల్ ఫోన్, బ్యాంక్ ఖాతాలను పరిశీలించగా.. డ్రైవర్ అకౌంట్ నుంచి జయరాజు కుమార్తె బ్యాంకు ఖాతాకు విడతల వారీగా దాదాపు రూ. 24.80 లక్షలు బదిలీ అయినట్లు తేలింది. ఇసుక రవాణా, ఇతర మైనింగ్ కాంట్రాక్టర్ల నుంచి డ్రైవర్ ద్వారా డబ్బులు వసూలు చేయించి, ఆ మొత్తాన్ని నేరుగా కూతురు ఖాతాకు మళ్లించినట్లు విచారణలో డ్రైవర్ అంగీకరించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ ముడుపుల వ్యవహారం వెనుక ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు లెక్క తేలిన ఆస్తుల మార్కెట్ విలువ బహిరంగ మార్కెట్లో మరింత ఎక్కువగా ఉంటుందని, ఈ కేసులో లోతైన విచారణ కొనసాగుతోందని ఏసీబీ స్పష్టం చేసింది.
