Telangana: అవ్వాక్కయ్యేలా ఏసీపీ ఉమామహేశ్వరరావు అవినీతి బాగోతం

ఏసీపీ ఉమామహేశ్వరరావు అవినీతి అందరిని అవ్వాక్కయ్యేలా చేస్తోంది. బయటపడుతున్న అక్రమ బాగోతాలు బెంబేలెత్తిస్తున్నాయి. సివిల్‌ కేసులను క్రిమినల్‌ కేసులుగా మార్చి లక్షల దండుకున్న ఆయన క్రైమ్‌ను చూసి అధికారులే షాక్‌ అవుతున్నారు. ఇంకా బయటపడని సీక్రెట్స్‌ అన్నీ ల్యాప్‌టాప్‌లో ఉన్నట్టు గుర్తించి డీకోడ్‌ చేస్తున్నారు.

Telangana: అవ్వాక్కయ్యేలా ఏసీపీ ఉమామహేశ్వరరావు అవినీతి బాగోతం
ACP Uma Maheswara Rao

Updated on: May 23, 2024 | 2:55 PM

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్​ సీసీఎస్​ ఏసీపీ​ ఉమామహేశ్వరరావుకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్​ విధించింది. ఈ మేరకు ఆయనను పోలీసులు చంచల్​గూడకు తరలించారు. అలాగే ఆయన బంధువులతో పాటు స్నేహితుల నివాసాల్లోనూ ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు.

అవినీతి అనకొండ ఉమామహేశ్వరరావు అక్రమ భాగోతాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఏసీపీగా ఉమామహేశ్వరరావు దొరికినంతా దోచుకున్నాడు. చెయ్యి తడపనిదే పనికాదంటూ గట్టిగానే వెనకేశాడు. న్యాయం కోసం వెళ్ళిన బాధితులకు చుక్కలు చూపించించాడు. సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చి లక్షల రూపాయలు జేబులో వేసుకున్నట్లు తెలియడంతో అధికారులే షాక్‌కు గురయ్యారు.

మొత్తంగా 3 కోట్ల 45 లక్షల రూపాయల సొత్తును గుర్తించారు అధికారులు. ఉమామహేశ్వరరావు నివాసంలో 38 లక్షల నగదు, 60 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్​ శివార్లతో సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 17 ప్రాంతాల్లో స్థిరాస్తులను అధికారులు గుర్తించారు. ఆర్‌ఎస్‌ కన్‌స్ట్రక్షన్స్‌ విల్లా కొనుగోలుకు 50 లక్షల పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. షామీర్​ పేట్​లో రూ.80 లక్షలు విలువైన ఎకరం భూమి, 333 గజాల విల్లాను గుర్తించారు. ఘట్​కేసర్​లో నాలుగు ప్లాట్లు, శామీర్​ పేట్​లో 14 గుంటల బినామీ భూమి, అశోక్​ నగర్​లో ఉన్న అపార్టుమెంట్​లో మూడు ఫ్లాట్లను, కూకట్​పల్లిలో 200 గజాల ఫ్లాట్​ను గుర్తించారు. ఏపీలోని విశాఖపట్టణంలో 25 సెంట్ల భూమి, చోడవరంలో 5.92 ఎకరాలు, 240 గజాల ప్లాట్, దొండపూడిలో 2.20 ఎకరాల బినామా ఆస్తులపై దర్యాప్తు సాగిస్తున్నారు అధికారులు.

మరోవైపు కీలక డాక్యుమెంట్స్‌తో పాటు ఉమామహేశ్వరరావు ల్యాప్‌టాప్‌ను కూడా స్వాధీనం చేసుకున్న అధికారులు… దానిని డీకోడ్‌ చేసే పనిలో పడ్డారు. అక్రమాలకు సంబంధించిన చిట్టా ఆ ల్యాప్‌ ట్యాప్‌లోనే ఉన్నట్లు భావిస్తున్నారు. దాన్ని డీకోడ్‌ చేయడం వల్ల మరికొంతమంది బయటకొచ్చే అవకాశం కనిపిస్తున్నాయి.

ఇక ఉమామహేశ్వరరావు వ్యవహార శైలిపై గతంలోనూ అనేక ఫిర్యాదులు అందాయని, తనపై ఇప్పటికే మూడుసార్లు సస్పెన్షన్ వేటు పడిందన్నారు అధికారులు. అయినా ఉమామహేశ్వరరావు తీరు మార్చుకోలేదని పేర్కొన్నారు. మరి చూడాలి విచారణ పూర్తయ్యేవరకు ఈ అవినీతి అనకొండ అక్రమాలు ఏ రేంజ్‌లో ఉంటాయో…!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..