AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మ బాబోయ్..! 6 నెలలో ఇంత మంది లంచావతారులు పట్టుబడ్డారా..?

తెలంగాణ అవినీతి నిరోధక బ్యూరో (ACB) అవినీతి ప్రభుత్వ అధికారులపై కఠిన చర్యలను ముమ్మరం చేసింది, గత ఆరు నెలల్లో మొత్తం 122 కేసులు నమోదు చేసింది. ఇది గత సంవత్సరం మొత్తం కేసులను అధిగమించింది. ప్రధాన ట్రాప్ కేసుల్లో GHMC, నీటిపారుదల శాఖ అధికారులు ఉన్నారు. అవినీతికి పాల్పడే అధికారులకు సంబంధించి తమకు సమాచారం ఇవ్వాలని ACB పౌరులను కోరుతుంది.

అమ్మ బాబోయ్..!  6 నెలలో ఇంత మంది లంచావతారులు పట్టుబడ్డారా..?
Telangana Acb
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Jun 24, 2025 | 4:41 PM

Share

తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు అక్రమార్కులపై దృష్టి సారించారు. ఏసీబీ అధికారులు ఎన్నడూ లేని విధంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో అక్రమార్కులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారు. గత 6నెలల్లోనే 122కేసులు నమోదు చేసి, వందలా మందిని కటకటాలపాలు చేశారు ఏసీబీ అధికారులు. లంచగొండి అధికారులపై మరింత దూకుడుగా వ్యవహరిస్తూ వరుస కేసులు, విచారణలతో ముచ్చెమటలు పట్టిస్తున్నారు.

తెలంగాణలో ఏసీబీ అధికారులు గత ఏడాది 2024లో మొత్తం 129 ట్రాప్‌ కేసులు నమోదు చేస్తే, ఈ ఏడాది 6 నెలలు పూర్తికాక ముందే ఈ సంఖ్య 122కు చేరుకోవడం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. రాష్ట్రంలో సగటున ప్రతి 3 రోజులకు 2 కేసుల చొప్పున నమోదవుతున్నాయి. ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేస్తున్న లంచావతారులు ఏమాత్రం జంకడం లేదు. గత కొన్ని రోజులుగా అక్రమార్కులు వరుసబెట్టి ఏసీబీకి పట్టుబడుతున్నారు. తెలంగాణ ఏసీబీ ఈ స్థాయిలో విరుచుకుపడటం ఈ మధ్యకాలంలో ఇదే మొదటిసారి.. అందుకే కేసుల సంఖ్య గణనీయంగా నమోదవుతోంది. ఏసీబీ అధికారుల సత్వర స్పందనతో బాధితుల్లో సైతం నమ్మకం కుదురుతోంది. దీంతో బాధితుల నుండి వచ్చే ఫిర్యాదులు కూడా పెరుగుతున్నాయి.

అయితే ఏసీబీ అధికారుల అధికారిక టోల్‌ఫ్రీ నంబర్ 1064తోపాటు 94404 46106 వాట్సప్‌ నంబరు, ఫేస్‌బుక్, ఎక్స్‌ లాంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ ద్వారా కూడా ఫిర్యాదు చేసే సౌలభ్యం ఉంది. ప్రజల్లో టెక్నాలజీ వినియోగం పెరగడం కూడా ఫిర్యాదులు ఎక్కువ సంఖ్యలో రావడానికి కారణంగా మారింది. సమాచారం రాగానే అధికారులు తొలుత అసలైనద కదా బాధితున్ని నిజంగానే లంచం డిమాండ్ చేశారా..! లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని నిర్ధారించుకుంటారు. ఎందుకంటే తమకు పడని అధికారులపైనా బాధితుల ముసుగులో ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. మరోవైపు చాలా సందర్భాల్లో బాధితులే ఫోన్, వీడియో రికార్డింగులు వంటివి సమర్పిస్తున్నారు. కొంతమంది లంచావతారులైతే యూపీఐ ద్వారానే ఆమ్యామ్యాలు స్వీకరిస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. బాధితులు సమర్పించిన ఇలాంటి ఆధారాలను మరోమారు పునఃపరిశీలించిన తర్వాతే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగుతున్నారు. గతంలో ఒక ఫిర్యాదును నిర్ధారించుకొని లంచం అడిగిన ఉద్యోగిని పట్టుకోవడానికి సగటున వారం నుంచి పది రోజులు పట్టేది. ఇప్పుడది మూడు నాలుగు రోజులకు తగ్గింది.

ఏసీబీకి వచ్చే ఫిర్యాదుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో అందుకు తగ్గట్టుగానే స్పందించేందుకు ఏసీబీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉండటంతో మరింత మంది సిబ్బందిని సమకూర్చుకునేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..