Telangana: స్మగ్లింగ్‌లో ‘పుష్ప’ను మించిన స్కెచ్.. రూ.30 లక్షల విలువైన గంజాయి సీజ్!
సినీ ఫక్కీలో గంజాయిని తరలిస్తూ ఓ ముఠా పట్టుబడింది. గుట్టుచప్పుడు కాకుండా బీరువాలో అమర్చి తరలిస్తున్న వాహనాన్ని టేకులపల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. దాదాపు 120 కిలోల గంజాయిని బీరువా లోపలి భాగంలో ఉంచి తరలిస్తూ పట్టుబడ్డారు. కొత్తగూడెంలోని కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ గంగన్న వివరాలు వెల్లడించారు. గంజాయి అక్రమ..
కొత్తగూడెం, జనవరి 1: సినీ ఫక్కీలో గంజాయిని తరలిస్తూ ఓ ముఠా పట్టుబడింది. గుట్టుచప్పుడు కాకుండా బీరువాలో అమర్చి తరలిస్తున్న వాహనాన్ని టేకులపల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. దాదాపు 120 కిలోల గంజాయిని బీరువా లోపలి భాగంలో ఉంచి తరలిస్తూ పట్టుబడ్డారు. కొత్తగూడెంలోని కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ గంగన్న వివరాలు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లుగా టేకులపల్లి పోలీసులకు డిసెంబర్ 28న విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు పకడ్బందీగా గస్తీ నిర్వహించారు. ఇల్లెందు డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో టేకులపల్లి సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సై రమణారెడ్డి ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో బీదర్‌కు చెందిన బీరువాలతో వస్తున్న ట్రక్కు అటుగా వచ్చింది. పోలీసుల తనిఖీలను గమనించిన ట్రక్కు డ్రైవర్ టేకులపల్లి పెట్రోల్ బంకు వెనుక వాహనాన్ని నిలిపివేసి పారిపోయాడు. ఒకేచోట 2 రోజులుగా వాహనం నిలిపి ఉండటం గమనించిన స్థానికులు సోమవారం ఉదయం పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని స్వాధీనపరుచుకొని తనిఖీలు చేశారు. ఈక్రమంలో బీరువాల బరువు ఎక్కువగా ఉండడంతో వాటిని నిశితంగా పరిశీలించగా అసలు విషయం బయటపడింది. బీరువాల వెనుక భాగం గంజాయి ప్యాకెట్లను అమర్చి వాటిని తయారు చేశారు. దీంతో పోలీసులు బీరువాలను కట్ చేసి అందులో ఉన్న దాదాపు120 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ రూ.30 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. గంజాయితోపాటు వాహనాన్ని పోలీసులు స్టేషన్‌కి తరలించి సీజ్ చేశారు.
ఆ వాహనం కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు చెందిన మహ్మద్ షకీల్ పాషా వద్ద నుంచి మజార్ అనే డ్రైవర్ కిరాయికి తీసుకెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పరారీలో ఉన్న నిందితుడు మజార్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. ఎవరైనా గంజాయి రవాణా చేస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.