AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cotton Farmers: పత్తి రైతుని కరుణించని వరుణుడు.. ఉత్తర తెలంగాణలో కమ్ముకొస్తున్న కరువు మేఘాలు..!

వ్యవసాయ సీజన్ ఆరంభమైంది.. కానీ వర్షాలు మొఖం చాటేయడంతో కరువు మేఘాలు కలవరపెడుతున్నాయి. విత్తిన పత్తి విత్తనాలు మొలకెత్తకపోవడంతో రైతులు దిగులుతో తలలు పట్టుకుంటున్నారు. ఆ విత్తనాలు ఉడిగిపోకుండా కాపాడుకునేందుకు మానవ ప్రయత్నాలు మొదలుపెట్టారు. వారిలోని ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని వెలికితీస్తూ పంటలు కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

Cotton Farmers: పత్తి రైతుని కరుణించని వరుణుడు.. ఉత్తర తెలంగాణలో కమ్ముకొస్తున్న కరువు మేఘాలు..!
Cotton Crop
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Jun 18, 2024 | 5:43 PM

Share

వ్యవసాయ సీజన్ ఆరంభమైంది.. కానీ వర్షాలు మొఖం చాటేయడంతో కరువు మేఘాలు కలవరపెడుతున్నాయి. విత్తిన పత్తి విత్తనాలు మొలకెత్తకపోవడంతో రైతులు దిగులుతో తలలు పట్టుకుంటున్నారు. ఆ విత్తనాలు ఉడిగిపోకుండా కాపాడుకునేందుకు మానవ ప్రయత్నాలు మొదలుపెట్టారు. వారిలోని ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని వెలికితీస్తూ పంటలు కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో కమ్ముకొస్తున్న కరువు మేఘాలు.. పత్తి రైతుల కంటతడిపెట్టిస్తున్నాయి. ఆరంభ శూరత్వంలా మురిపించిన వర్షాలు అడ్రస్ లేకుండా పోయాయి.. రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు రైతులను కలవరపెడుతున్నాయి. భిన్న వాతావరణంతో జూన్ నెలలో ఇప్పటివరకు కనీస వర్షపాతం నమోదు కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.. ఈ ఖరీఫ్ సీజన్లో ఆరంభంలోనే రైతులకు చేదు అనుభవం ఎదురవుతుండడంతో అయోమయం నెలకొంది..

ఈ వ్యవసాయ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 55 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతుందని అంచనా.. జూన్ మొదటి వారంలోనే దాదాపుగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పత్తి విత్తనాలు విత్తారు. తొలకరి చినుకులను చూసి ఆనందంతో మురిసిపోయారు. కానీ గత 15 రోజుల నుండి చినుకు చుక్క జాడలేదు. అప్పుడప్పుడు ఉరుములు మెరుపులు మురిపిస్తున్నా వాన చుక్కజాడలేదు.. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పోటీపడి మరి విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు ఇప్పుడు బిత్తరపోయి ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు..

వరంగల్ ఉమ్మడి జిల్లాలో 16 లక్షల 82 వేల ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణం ఉండగా.. అందులో దాదాపుగా ఆరున్నర లక్షల ఎకరాలకు పైగా పత్తి సాగు జరుగుతుందని అంచనా వేశారు.. ఇప్పటికే పత్తి విత్తనాలు 90% శాతం విత్తారు. కానీ వర్షాలు లేకపోవడంతో చాలా ప్రాంతాల్లో ఆ విత్తనాలు మొలకెత్తడం లేదు. దీంతో రైతులు పడరాన్ని పాట్లు పడుతున్నారు.. కొన్ని ప్రాంతాల్లో బిందెలు, బకెట్ల ద్వారా నీళ్లు తీసుకువచ్చి ఆ విత్తనాలను తడుపుతున్నారు.. మరికొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీళ్లు తీసుకువచ్చి డ్రిప్పింగ్ పద్ధతిలో విత్తనాలను తడిపి మొలకెట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు

ఇప్పటికే విత్తిన విత్తనాలు మొలకెత్తకపోవడంతో కొంతమంది రైతులు దిగులతో తలలు పట్టుకున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్ జిల్లాలో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. జూన్ నెలలో నమోదు కావాల్సిన సాధారణ వర్షపాతం కంటే 43% లోటు వర్షపాతం కనిపిస్తుంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.. విత్తిన విత్తనాలను కాపాడుకోవడం కోసం భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు..

దాదాపుగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అంతటా ఇదే పరిస్థితి.. కనీస వర్షపాతం లేకపోవడంతో రైతులు ఆకాశం వైపు ఎదురుచూస్తూ తీవ్ర నిరాశ చెందుతున్నారు.. మరోవైపు గ్రామాల్లో కప్పతల్లి ఆటలు, పొలిమేర దేవతలకు పూజలు చేస్తున్నారు..

కరువు మేఘాలు కమ్మేయడంతో ఈసారి పంటలు అయోమయంలో చిక్కుకున్నాయని రైతుల ఆందోళన చెందుతున్నారు. సకాలంలో విత్తనాలు దొరికినా వాన దేవుడి కరుణ లేకపోవడంతో అన్నదాతల్లో నైరాస్యం కనిపిస్తోంది.