Telangana: అసెంబ్లీ ఎన్నికల బరిలో సోషల్ మీడియా బర్రెలక్క.

| Edited By: Ram Naramaneni

Nov 09, 2023 | 1:44 PM

నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్‌ గ్రామానికి చెందిన శిరీష కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. నేను ఈ ఎన్నికల్లో ప్రచారం చేయలేక పోవచ్చు.. డబ్బు పంచలేక పోవచ్చు.. కానీ ఓటర్లైన ప్రజలు ఏది మంచి ఏది చెడు అనేది ఆలోచించాలన్నారు శిరీష. ఆమె బర్రెలక్కగా ఇన్‌స్టాలో ఎంతో ఫేమస్.

Telangana: అసెంబ్లీ ఎన్నికల బరిలో సోషల్ మీడియా బర్రెలక్క.
Barrelakka
Follow us on

బర్రెలక్క గుర్తుందా… “హాయ్ ఫ్రెండ్స్… బర్ల కాయ వచ్చిన ఫ్రెండ్స్.. ఎంత చదివినా డిగ్రీలకు డిగ్రీలు మెమోలు వస్తున్నాయి గానీ జాబ్‌లు అయితే వస్తలేవు. నోటిఫికేషన్ వేయరు.. ఏం వేయరు అందుకే మా అమ్మను అడిగి నాలుగు బర్లు కొన్నా… పొద్దున 3 లీటర్లు, సాయంత్రం 3 లీటర్లు మొత్తం 6లీటర్ల పాలు ఇస్తాయి… రోజుకు రూ.300ఎక్కడ పోవు ఫ్రెండ్స్… ఇవ్వే మా బర్లు” అంటూ ఆమె చేసిన వీడియో నెట్టింట అప్పట్లో తెగ వైరల్ అయ్యింది.

ఈ బర్రెలక్క అసలు పేరు శిరీష. స్వగ్రామం నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్. డిగ్రీలు చేసినా ఉద్యోగాలు రావడం లేదంటూ వినూత్నంగా రూపొందించిన ఆమె వీడియో సందేశం రెండేళ్ల క్రితం తెగ వైరల్ అయ్యింది. అలాగే తెగ ట్రోల్ సైతం అయ్యింది. ఆనంతరం అదే బర్రెలక్క పేరుతో సోషల్ మీడియాలో ప్రస్తుతం కంటెంట్ క్రియేటర్‌గా మారింది. హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బర్రెలక్క అంటూ ఆమె చేస్తున్న వీడియోలు ఇప్పటికీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూనే ఉన్నాయి.

ఇక బర్రెలక్కగా తెలంగాణ ప్రజలకు సుపరిచితులైన ఆమె అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ ప్రవేశానికి సన్నద్ధం అయ్యింది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్దమైంది. ఈ మేరకు నిన్న కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.

నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడిన బర్రెలక్క ఆసక్తికర అంశాలు చెప్పారు. ఉద్యోగార్థుల తరుపున బరిలో నిలుస్తున్నాని తెలిపారు. తాను అన్ని పార్టీల మాదిరిగా డబ్బులు పంచలేనని, ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించలేనని వెల్లడించారు. ప్రజలు ఏది న్యాయం, ఏది అన్యాయమో తెలుసుకొని తనని గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు తనకు మద్దతు తెలపాలని కోరారు. ఇక బర్రెలక్క రాజకీయ ప్రవేశంపై నెట్టింట హాట్ టాపిక్ మారింది. కొంతమంది మద్దతు తెలుపుతుండగా… మరికొంత మంది ట్రోల్స్ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..