
కేవలం ఐదు రూపాయలు ఒక పెద్ద గొడవకు కారణమయ్యింది. సర్దుకుపోయి మాట్లాడుకుంటే పరిష్కారమయ్యే ఒక చిన్న సమస్య పెద్ద గొడవకు దారి తీసింది. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని కర్రతో వాతలు వచ్చేలా కొట్టి తలపై తీవ్రంగా దాడి చేసి దారుణానికి పాల్పడ్డారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గెరిగేంట్ పల్లిలో కల్లు ధర అమాంతం ఐదు రూపాయలు ఎలా పెంచుతారని అడగడం వల్లే దాడికి పాల్పడ్డారని బాధితుడు శ్రీనివాస్ చెప్పాడు. పది రూపాయలు ఉన్న కల్లు సీసా ధర రూ.15 కు పెంచి వ్యాపారి దత్తాత్రేయ గౌడ్ అమ్ముతున్నాడని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాను కల్లు తాగిన అనంతరం పెంచిన ధర గురించి కల్లు వ్యాపారి దత్తాత్రేయ గౌడ్‌కు అడిగినట్లు తెలిపాడు. ఇలా అడగడమే మాటామాటా పెరిగి పెద్ద గొడవలా మారిందన్నాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడంతో వ్యాపారి దత్తాత్రేయ గౌడ్ వారి అనుచరులతో కలిసి తనపై దాడి చేశారని బాధితుడు వాపోయాడు. ఆ ప్రాంతంలో ఒక్క ఈత చెట్టు కూడా లేదు. వ్యాపారి అమ్మేదే కల్తీ కల్లు. ఆపై ఇదేంటని అడిగితే ఇలా తనపై దాడి చేయించాడని సమాచారం.
తాను వికారాబాద్ మున్సిపల్ కార్మికుడిని అని.. పని పూర్తి చేసుకున్నాక అలసిపోయి కల్లు తాగి సేద తీరుదామని వెళ్తే తనపై ఇంత దారుణంగా దాడి చేస్తారా అని బాధితుడు ప్రశ్నించాడు. తలపై రక్తం వచ్చేలా గట్టిగా కొట్టి దాడి చేశారని, ఒంటిపై దాడి చేయడం వల్ల వాతలు తేలాయని పోలీసులకు చూపించాడు. అంతటితో ఆగకుండా తనను కులం పేరుతో దూషించి దాడి చేశారని వికారాబాద్ పోలీస్ స్టేషన్లో బాధితుడు శ్రీనివాస్ ఫిర్యాదు చేశాడు. దీనిపై వెంటనే చర్యలు తీసుకుని తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరాడు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టి తగిన న్యాయం జరిగేలా చూసి భవిష్యత్తులో ఇలాంటి దారుణాలు జరగకుండా చర్యలు చేపడతామని పోలీసులు వెల్లడించారు.