
మహాశివరాత్రిని దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. శివరాత్రి రోజు మహాశివుడి కొలిచేందుకు విభిన్న రూపాల్లో శివలింగాలు తయారు చేస్తుంటారు. విభిన్న రూపాల్లోని శివలింగానికి పూజ చేస్తూ రాత్రంతా జాగారం చేస్తుంటారు. గత కొంతకాలంగా విభిన్న రూపాల్లో శివలింగాలను తయారు చేస్తున్న శివాచారి ఈ సారి కాయిన్స్ తో తయారు చేసిన శివలింగం ఆకట్టుకుంటుంది.
సత్తెనపల్లికి చెందిన శివాచారి ధారు శిల్పి.. చెక్కలపై అందమైన కళాక్రుతులు చెక్కుతుంటాడు. అయితే శివభక్తుడైన శివాచారి ప్రతి యేటా మహాశివరాత్రి సందర్భంగా విభిన్న వస్తువులతో శివలింగాన్ని తయారు చేస్తుంటాడు. ఇందులో భాగంగానే ఈ ఏడాది కాయిన్స్ తో శివలింగాన్ని తయారు చేశాడు. ఇందుకోసం ఐదు రూపాయల కాయిన్స్ ఉపయోగించాడు. దాదాపు ఐదు వేల ఐదు రూపాయల కాయిన్స్ తో శివలింగాన్ని తయారు చేశాడు. అన్ని కాయిన్స్ బంగారు రంగులో ఉండటంతో శివలింగాన్ని చూపరులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. మూడు అడుగుల ఎత్తున్న కర్ర చుట్టూ ఒక క్రమ పద్దతిలో కాయిన్స్ ను పేర్చుకుంటూ శివలింగాన్ని రూపొందించారు. 25 రోజుల పాటు శ్రమించి ఈ అందమైన శివలింగాన్ని తయారు చేశారు. ఇందుకు అవసరమైన కాయిన్స్ ను తన స్నేహితుల సాయంతో సమకూర్చుకున్నట్లు శివాచారి చెప్పాడు.
ఈ శివలింగాన్ని ముప్పాళ్ల మండలం లంకెలకూరపాడులోని ఉమామహేశ్వర ఆలయానికి బహూకరించారు. శివరాత్రి రోజు లింగోద్భవ సమయంలో ఈ శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు చేయవచ్చంటున్నారు. దీంతో పండుగ రోజు కాయిన్స్ శివలింగం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి