Minister KTR: సాధారణంగానే ప్రభుత్వ అధికారులు కొందరు అలసత్వానికి మారుపేరుగా ఉంటారని జనాలు భావిస్తుంటారు. వారి ఆలోచనలకు తగ్గట్లుగానే మరికొందరు అధికారులు నడుచుకుంటారు కూడా. అయితే, విషయం తమ పరిధిలో ఉన్నంత వరకే ఎవరి ఆటలైనా సాగుతాయి.. పైస్థాయికి వెళితే మాత్రం నీళ్లు నమలాల్సిందే. ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు షాద్‌నగర్ మునిసిపల్ అధికారులు. తన మొరను ఎంతకీ ఆలకించని అధికారుల తీరుపై ఓ బాధితుడు ఏకంగా మంత్రికే తెలియజేయడంతో.. దెబ్బకు దిగివచ్చారు. ఆగమేఘాల మీద అన్ని పనులు చేసేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణానికి చెందిన శంకర్ గౌడ్ ఇంటి నిర్మాణం చేపట్టాలని భావించాడు. ఇందులో భాగంగా తన ఇంటి నిర్మాణం కోసం అనుమతులు కోరుతూ మునిసిపల్ అధికారులకు దరఖాస్తు పెట్టుకున్నాడు.
ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకుని 45 రోజులు గడిచినా మునిసిపల్ అధికారుల నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దాంతో అధికారులు తీరుపై విసిగి వేసారిన శంకర్ గౌడ్.. నేరుగా రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు తన గోడు వెల్లబోసుకుంటూ ట్వీట్ చేశాడు. అధికారుల తీరుపై ఫిర్యాదు చేశాడు. అయితే, శంకర్ గౌడ్.. మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేశాడని తెలుసుకున్న షాద్‌నగర్ మునిసిపల్ కార్యాలయ అధికారులు వెంటనే అలర్ట్ అయ్యారు. ఆగమేఘాల మీద శంకర్ గౌడ్ ఇంటి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారు. అయితే, అప్పటికే శంకర్ గౌడ్ చేసిన ఫిర్యాదు మంత్రి, ఉన్నతాధికారుల దృష్టికి చేరడం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వడంలో ఆలస్యానికి కారణాలు తెలుపాలని మునిసిపల్ శాఖ కమిషనర్ లావణ్య.. షాద్‌నగర్ టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ సురేష్‌కు నోటీసులు ఇచ్చారు.
Also read:
Viral Video: హోటల్ యజమానికి చేదోడు వాదోడుగా ఉంటోన్న కోతి… నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న వీడియో…