ఆయన నాలుగుసార్లు పార్లమెంటు సభ్యులు. ఆ లోక్‌సభ సెగ్మెంట్‌లోనే సీనియర్ దళితనేత. అయినప్పటికి గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓ రాజకీయ పార్టీ టికెట్ ఇవ్వలేదు. తర్వాత ఇటివలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. దీంతో అసెంబ్లీ సీటు ఎలాగూ పోయింది, ఎంపీ సీటు కోసమైన బరిలో ఉండాలంటే హస్తం పార్టీలో చేరాలని ఎన్నికల వేళ నిర్ణయం తీసుకున్నారు. తీరా అక్కడ కూడా ఈ దఫా ఎంపీ ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. దీంతో డెబ్బై ఏళ్లు దాటిన తగ్గేదేలే అంటూ బీఎస్పీ నుంచి బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట.
మందా జగన్నాధం.. నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్‌లో పరిచయం అక్కరలేని పేరు. ఏకంగా నాలుగు సార్లు ఈ స్థానం నుంచి ఎంపీగా గెలిచి రికార్డు సృష్టించారు. పార్టీలు ఏవైనా గెలుపు తనదే అన్న రీతిలో నాడు రాజకీయాలు చేసేవాడు. కానీ రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గులాబీ పార్టీ నుంచి పోటి చేసి ఓటమి పాలయ్యారు. అంతే పరిస్థితులు మొత్తం మారిపోయి. టికెట్ కోసం పార్టీలు మారినా కనీసం ఏ ఒక్క పార్టీ కనికరించలేదు.
1996లో తొలిసారి తెలుగుదేశం పార్టీ నుంచి నాగర్ కర్నూల్ ఎంపీగా మందా జగన్నాధం పార్లమెంటులో అడుగుపెట్టారు. అనంతరం 1999 నుంచి వరుసగా మూడు సార్లు విజయం సాధించి తిరుగులేని నేతగా ఎదిగారు. మొత్తం మూడు సార్లు టీడీపీ నుంచి గెలుపొందితే, 2009లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు మందా జగన్నాధం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో నాటి టీఆర్ఎస్ అభ్యర్థిగా మాత్రం మందా ఓడిపోవడం ఆయన పొలిటికల్ కెరీర్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది.
ఇక, 2019లో మాత్రం మందా జగన్నాధంను కాదనీ పొతుగంటి రాములుకు గులాబీ బాస్ కేసీఆర్ టికెట్ కేటాయించారు. దీంతో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. అయితే మధ్యలో ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కేసీఆర్ అవకాశం కల్పించినప్పటికీ, అసంతఈప్తిని మాత్రం వీడలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్ నుంచి కుమారుడికి లేదా తనకు టికెట్ కేటాయించాలని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానాన్ని కోరారు. అయితే ఇద్దరికి కాకుండా విజేయుడుకు గులాబీ బాస్ బీ ఫామ్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం ఎంపీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ టికెట్ ఆశించారు. పార్టీ అధిష్టానం మల్లు రవికి టికెట్ ప్రకటనతో ఆయన మరోమారు ఆలోచనలో పడిపోయారు. ఏది ఏమైనా ఈసారి ఎంపీ ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించకున్నారు. బీఎస్పీ తరఫున ఎన్నికల క్షేత్రంలో నిలవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో బీఎస్పీ అధినేత్రి మాయవతి అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో పార్టీ నుంచి టికెట్ తెచ్చుకుని తిరిగి సొంత నియోజకవర్గానికి వస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
పార్టీలు టికెట్ ఇవ్వకపోయిన డెబ్బై ఏళ్ల వయసులో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు మందా జగన్నాధం. అయితే బీఎస్పీ తరఫున బరిలో దిగితే మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థిగా కొనసాగుతున్న ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు నష్టం జరుగుతుందని నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. మందా పోటీతో ఓట్లు చీలే అవకాశం ఉంటుందని అన్ని పార్టీల క్యాడర్ చర్చించుకుంటుంది. అలా జరిగితే ఎవరూ విజేతగా నిలుస్తారోనని టెన్షన్ కనిపిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…