IPS పదవికి RS ప్రవీణ్‌కుమార్ రాజీనామా చేశారు. IPS అధికారి RS ప్రవీణ్‌కుమార్ రాజీనామా చేశారు. వాలంటరీ రిటైర్మెంట్ కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారాయన. 26 ఏళ్లుగా తనకు సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు శాఖలో పనిచేయడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. పేదలకు నాణ్యమైన చదువు అందాలని భావించి, సాంఘిక సంక్షేమ శాఖ బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా భావించి ఆయన్ను ప్రోత్సహించడంతో.. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో సమూల మార్పులు చేశారు. పేదల బిడ్డలు జ్ఞానవంతులు కావాలని సంకల్పించి పూర్తి అంకిత భావంతో పని చేశానని చెప్పిన ప్రవీణ్‌కుమార్.. సంక్షేమ భవనంలో తొమ్మిది సంవత్సరాల కాలం 9నిమిషాలుగా గడిచిపోయిందన్నారు. మరోవైపు పదవీ విరమణ తర్వాత అంబేడ్కర్, పూలె, కాన్షీరాం మార్గంలో నడిచి.. పేదలకు, పీడితులకు అండగా ఉండి భావితరాలను కొత్త ప్రపంచంలోకి నడిపించే ప్రయత్నం చేస్తానని స్పష్టం చేశారు.
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) July 19, 2021
మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్‌లో జన్మించిన ప్రవీణ్ కుమార్.. 2002 నుంచి 2004 వరకు కరీంనగర్ జిల్లా ఎస్పీగా పనిచేశారు. ప్రవీణ్ కుమార్ హయాంలో ఒకేసారి 45మంది జనశక్తి మావోయిస్టులు లొంగిపోయారు. సంకల్పం, సంజీవని, కాలే కడుపుకి బుక్కెడు అన్నం, మావోయిస్టుల బాధిత సంఘం, టీచర్లు మా ఊరికి రండి, మా ఊరిగోసలాంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన హాయలోనే మంథని, కాటారం, మహదేవ్ పూర్ లో సంచలన ఎన్ కౌంటర్లు జరిగాయి.
2012లో స్వేరోస్ పేరుతో ఎన్జీవో ప్రారంభించారు. ఆ సంస్థ కార్యకలాపాలు వివాదాస్పదం కావడంతో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు ప్రవీణ్‌కుమార్. 2013లో గురుకులాల సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. గురుకులాల్లో చదివిన విద్యార్థులను స్వేరోస్‌గా చేర్చారు ప్రవీణ్ కుమార్. 2019లో స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ స్థాపించారు. ఆ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులతో చేయించిన ప్రమాణాలు అప్పట్లో వివాదంగా మారింది.