Telangana: ఆ లోక్ సభ టికెట్‎ కోసం త్రిముఖ పోటీ.. ప్రత్యేక పదవికి సైతం రాజీనామా చేసిన కీలక నేత..

|

Feb 24, 2024 | 11:55 PM

నామినేటెడ్ పోస్టులు కాదు.. ప్రజల చేత నేరుగా ఎన్నుకొనే పోస్టులే కావాలంటున్నారు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి. నాగర్‌కర్నూల్‌ నుంచి పోటీకి సిద్ధమని.. ఎంపీగా అవకాశం ఇవ్వాల్సిందే అని తేల్చి చెబుతున్నారు. ఎంపీ టికెట్‌ ఇవ్వడానికి అడ్డొస్తుందనే.. ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు మల్లు రవి.

Telangana: ఆ లోక్ సభ టికెట్‎ కోసం త్రిముఖ పోటీ.. ప్రత్యేక పదవికి సైతం రాజీనామా చేసిన కీలక నేత..
Mallu Ravi
Follow us on

నామినేటెడ్ పోస్టులు కాదు.. ప్రజల చేత నేరుగా ఎన్నుకొనే పోస్టులే కావాలంటున్నారు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి. నాగర్‌కర్నూల్‌ నుంచి పోటీకి సిద్ధమని.. ఎంపీగా అవకాశం ఇవ్వాల్సిందే అని తేల్చి చెబుతున్నారు. ఎంపీ టికెట్‌ ఇవ్వడానికి అడ్డొస్తుందనే.. ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు మల్లు రవి. లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్ని కసరత్తు మొదలుపెట్టాయి. ఎంపీ టికెట్ సాధించేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. ఇదే సమయంలో ఉమ్మడి పాలమూరులోని నాగర్‌కర్నూల్ టికెట్ ఇప్పుడు ఆసక్తిగా మారింది. నాగర్‌కర్నూల్‌ ఎస్సీలకు రిజర్వ్‌ కాగా మొదటి నుంచి టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ లోక్‌సభ టికెట్‌ ఆశిస్తున్నారు. ప్రజల అభీష్టం మేరకే నాగర్‌కర్నూల్‌ ఎంపీగా పోటీ చేస్తానన్నారు. తాను పోటీ చేయడానికి అధికార ప్రతినిధి పదవి అడ్డు వస్తే ఆ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించినట్లుగానే.. ఢిల్లీలో ప్రత్యేకప్రతినిధి పదవికి రాజీనామా చేశారు.

గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నిర్వహించిన బహిరంగసభల వేదికగా తాను ఎంపీగా బరిలో ఉంటానని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. నాగర్‌కర్నూల్ టికెట్‌ను మల్లు రవితో పాటు.. ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, మాజీ ఎంపీ మందా జగన్నాథం కూడా ఆశిస్తున్నారు. అయితే లోక్‌సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మల్లు రవిని ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు సీఎం రేవంత్. ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్ ప్రకారం.. ఒకరికి ఒక్క పదవే ఉండాలన్న రూల్‌ పార్టీలో ఉందని.. దీంతో తాను ఎంపీగా పోటీ చేయట్లేదన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్నాయన్నారు. అందుకే రాజీనామా చేశానని, దీనిని ఆమోదిస్తారో లేదో సీఎం నిర్ణయానికే వదిలేశా అన్నారు. ఖచ్చితంగా ఎంపీ టికెట్‌ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు మల్లు రవి. ఒకవేళ టికెట్‌ ఇవ్వకపోతే కారణమేంటో చెప్పాలన్నారు.

ఇటీవల కొడంగల్ సభలో.. మహబూబ్‌నగర్ అభ్యర్థిగా వంశీచంద్‌ను సీఎం రేవంత్ ప్రకటించడంతో నాగర్‌కర్నూల్‌పై ఖర్చీఫ్ వేసిన మల్లు రవి అలర్ట్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు టికెట్ ఇవ్వాల్సిందే అంటున్నారు. మరోవైపు నాగర్‌కర్నూల్ టికెట్ ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌కు కేటాయించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఇటీవల సంపత్‌కుమార్‌ ప్రకటించారు. ఇక ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి పోస్ట్‌కు రాజీనామా చేసి.. కాంగ్రెస్‌లో చేరిన తన త్యాగాన్ని పార్టీ గుర్తిస్తుంది అంటున్నారు మల్లు రవి. ఆయితే.. ఈ ట్రై యాంగిల్ ఫైట్‌లో నాగర్‌కర్నూల్ టికెట్ ఎవరిని వరిస్తుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..