అది శత్రు దేశం కాదు.. కానీ హద్దులుంటాయ్. వాళ్లు చొరబాటుదారులు కాదు.. కానీ నిత్యం వేధింపులే. అదెక్కడో కాదు.. మన హైదరాబాద్‌లోనే. ఎందుకో చూడండి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో జనం కష్టాలు కొనసాగుతున్నాయ్. పాత సమస్యలకు తోడు ఇప్పుడు కొత్త కష్టాలు కల్లోలం రేపుతున్నాయ్. పరిష్కారం లేని సమస్యలతో సతమతమైపోతున్నారు అక్కడి ప్రజలు. అడుగడుగునా ఆర్మీ ఆంక్షలతో అష్టకష్టాలు పడుతున్నారు. డెవలప్‌మెంట్ మాట దేవుడెరుగు.. కనీసం స్వేచ్ఛగా జీవించే హక్కే లేకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు కంటోన్మెంట్ వాసులు.
కంటోన్మెంట్ ఏరియాలో 27 రోడ్లను బ్లాక్ చేసింది ఆర్మీ. కొన్ని రోడ్లకైతే ఏకంగా అడ్డుగోడలే కట్టేసింది. కొన్నింటికి ఇనుప కంచెలు పెట్టి, మరికొన్ని చోట్ల మిలటరీ కాపలా పెట్టింది. ఇప్పుడు నివాస ప్రాంతాలపైనా నిషేధాజ్ఞలు విధించింది. ఆట స్థలాలపైనా ఆంక్షలు పెట్టడంతో ఇబ్బందులు పడుతున్నారు జనం. లక్షలాది మంది నివాసముంటోన్న ప్రాంతంలో ఇలా రోడ్లను మూసేసి, ఆంక్షలు పెట్టడం సరికాదంటున్నారు స్థానికులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించుకుని ఈ సమస్యకు పరిష్కారం చూపించాలంటున్నారు కంటోన్మెంట్ వాసులు.
కాగా, కంటోన్మెంట్ వాసుల కష్టాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పర్యాయాలు కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకుంది. కంటోన్మెంట్ పరిధిలో కొన్ని సడలింపులు ఇవ్వాలని, అభివృద్ధి పనులకు అవకాశం కల్పించాలని కోరామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. రక్షణ తమ అభ్యర్థనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని రక్షణ శాఖ స్పందించాలని, తగు చర్యలు చేపట్టాలని అటు కంటోన్మెంట్ ప్రజలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖను వేడుకుంటోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..