
మంచిర్యాల జిల్లాలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్‌కు పెను ప్రమాదం తప్పింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లాలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి టూటౌన్ వైపు వెళుతుండగా.. అటుగా వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా ఎమ్మల్యే కాన్వాయ్ పైకి దూసుకొచ్చింది. గమనించిన ఎమ్మెల్యే కాన్వాయ్ డ్రైవర్ అప్రమత్తమై చాకచక్యంగా వ్యవహరించి కారును పక్కకు తీసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే కాన్వాయ్‌లోని వాహనాలు ఒక దానికి ఒకటి ఢీ కొట్టాయి. దీంతో ఎమ్మెల్యే కాన్వాయ్‌లోని పలు వాహనాలు స్వల్పంగా ధ్వంసం అయ్యాయి. అయితే ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను మద్యం మత్తులో ఉన్నట్టు స్థానికులు, ఎమ్మెల్యే సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బస్సు నడుపుతున్న వ్యక్తి కోరుట్ల డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ మల్లేష్‌గా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా 105 పాయింట్లు వచ్చినట్టుగా నిర్ధారణ అయింది. దీంతో డ్రైవర్ జక్కుల మల్లేష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.