
ఆ బాలుడు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఆ బాలిక ఏమో తొమ్మిదో తరగతి చదువుతోంది. సరిగ్గా చెప్పాలంటే.. ఆమెది 14.. అతడిది 13 ఏళ్లు. తెలిసీ తెలియని వయస్సులో కలిగిన ఆకర్షణతో ఇద్దరూ కలిసి బతకాలని అనుకున్నారు. ఇంట్లో నుంచి ఎవరికి చెప్పకుండా పరారయ్యారు. కట్ చేస్తే.! విజయవాడలో బస్సెక్కి.. హైదరాబాద్‌లో దిగారు. కృష్ణలంక ప్రాంతానికి చెందిన ఈ మైనర్లకు చివరికి ఏం జరిగిందంటే.? వివరాల్లోకి వెళ్తే.. విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్లు ఇంట్లో నుంచి పరారయ్యారు. మొదటిగా స్కూల్‌కి వెళ్తున్నానని చెప్పి.. సదరు బాలిక.. బాలుడి ఇంటికి వెళ్ళింది. ఆ రోజు బాలుడి పుట్టినరోజు కావడంతో.. ఇద్దరూ కేక్ కట్ చేసి.. ఆపై సాయంత్రం రూ. 10 వేలు, ఓ ఫోన్‌తో హైదరాబాద్‌కు బస్సెక్కారు.
స్కూల్ సమయం ముగిసినా.. బాలిక ఎంతకూ తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు పాఠశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. స్కూల్‌కి రాలేదని వారు చెప్పగా.. ఆమె స్నేహితుల నుంచి కూడా ఎలాంటి సమాచారం రాకపోవడంతో.. కృష్ణలంక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ స్వీకరించి.. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. సదరు బాలిక స్కూల్ యూనిఫాంలో బాలుడితో కలసున్న దృశ్యాలు కనిపించాయి. ఇంతలో బాలుడి తల్లిదండ్రులు కూడా స్టేషన్‌కు ఫిర్యాదు మేరకు రావడంతో.. ఇద్దరూ కలిసి వెళ్లినట్లు తేలింది. బాలుడు తీసుకెళ్లిన ఫోన్ స్విచాన్ కావడంతో.. ఆ లొకేషన్ హైదరాబాద్‌లో ఉన్నట్టు గుర్తించారు. వెంటనే హైదరాబాద్ బయల్దేరారు పోలీసులు.
బుధవారం రాత్రి 10 గంటలకు హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో దిగిన మైనర్లు.. ఆటోలో తుక్కగూడకు వచ్చారు. ఇల్లు అద్దెకు దొరుకుతుందేమోనని వెతకగా.. వారిని గమనించిన ఓ ఆటోడ్రైవర్.. ఇద్దరినీ తన ఇంటికి తీసుకెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. ఇంతలో పోలీసులు సైతం అక్కడికి చేరుకోవడంతో వారిని అదుపులోకి తీసుకుని.. విజయవాడ తీసుకొచ్చి అప్పగించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..