Telangana: బడి బస్సుల మరణమృదంగం.. రోడ్డు ప్రమాదాల్లో పిట్టల్లా నేలరాలుతున్న పసిబిడ్డలు

ఓవైపు స్కూల్‌, కాలేజీ బస్సులు, మరోవైపు నో ఎంట్రీ నిబంధనలను ఉల్లంఘిస్తోన్న లారీలు , ట్రక్కులు గ్రేటర్‌ హైదరాబాద్‌ను నెత్తురోడిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో పిల్లలు పిట్టల్లా రాలుతున్నారు. తీరని శోకాన్ని మిగులుస్తోన్న ఈ దారుణాలకు కారణాలేంటి? బాధ్యులెవరు? బడిబాటలో మరణమృదంగానికి కళ్లెం ఎప్పుడు? ఎలా?...

Telangana: బడి బస్సుల మరణమృదంగం.. రోడ్డు ప్రమాదాల్లో పిట్టల్లా నేలరాలుతున్న  పసిబిడ్డలు
School Bus Accidents

Updated on: Feb 11, 2025 | 1:58 PM

భద్రంగా బడికి చేర్చాల్సిన బస్సులే  చిన్నారులను బలితీసుకుంటున్నాయి. పెద్ద అంబర్‌పేటలో ఎల్‌కేజీ చిన్నారి రిత్వికను బడి బస్సు పొట్టన పెట్టుకుంది. షేక్‌పేటలో లారీ ఢీకొని చిన్నారి అధర్వి చనిపోయింది.  2023లో   ఆరుగురు చిన్నారులు బస్సు ప్రమాదాల్లో చనిపోయారు.8మంది తీవ్రంగా గాయపడ్డారు.2024లో ఐదుగురు చనిపోయారు. ఇలా బడిబాట మరణమృదంగం తీరని శోకాన్ని మిగులుస్తోంది. బడి  బస్సులు యమపాశాల్లా ఎందుకు  మారుతున్నాయి?  ముందే ఏడాది మొత్తానికి ట్రాన్స్‌పోర్ట్‌ చార్జ్‌ లాగేస్తున్న స్కూల్‌ యాజమాన్యాలు.. భద్రతను గాలికి వదిలేస్తున్నాయా?..తగినన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా? ఔననేది ఆర్టీఏ అధికారుల మాట.

ఓవైపు బడి బస్సుల నిర్వహణలో నిర్లక్ష్యం..మరోవైపు నో ఎంట్రీ  రూల్స్‌కు విరుద్దంగా లారీలు, ట్రక్కుల బీభత్సం.. మహానగర రోడ్లను రక్తసిక్తం చేస్తున్నాయి. మరి ప్రమాదాల నివారణకు ట్రాఫిక్‌ వ్యవస్థ ఎలాంటిచర్యలు చేపడుతోంది. మరి ఫిట్‌నెస్ లేని బస్సుల మాటేంటి? నో ఎంట్రీ రూల్స్‌ను ఉల్లంఘిస్తున్న లారీలు, హెవీ వెహికల్స్‌కు కళ్లెం ఎప్పుడు? తాజాగా శామీర్‌పేటలో  రెడీమిక్స్‌ వెహికల్‌ భీభత్సం సృష్టించింది. విద్యార్ధులపై దూసుకెళ్లింది.ఈ  ఘటనలో పలువురు స్టూడెంట్స్‌కు గాయాలయ్యాయి.ఈ స్పాట్‌లో నిత్యం యాక్సిడెంట్లు జరుగుతున్నా అధికారులు చర్యలు చేపట్టడంలేదని ఆందోళనకు దిగారు స్థానికులు.

ఫిట్‌నెస్‌లేని బస్సులు నడపొద్దని జీవోనెం.35 అమల్లో ఉంది.  అధికార లెక్కల ప్రకారం ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌లో  స్కూళ్లు, కాలేజీ బస్సుల  సంఖ్య  13వేల200 .వాటిలో  ఫిట్‌నెస్‌ వున్నవి ఎన్ని?లేనివి ఎన్ని?.  ఫిట్‌నెస్‌ వున్న  బస్సుల్నే నడుతుపున్నారా? లేదంటే  తూతూ తనిఖీలు..లంచాలతో అనుమతులా వ్యవహారం ఉందా?-డొక్కు బస్సులకు రంగులేసి  జీవితాలతో చెలగాటం ఆడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా  శిక్షణలేని డ్రైవర్ల వల్ల  ప్రమాదాలు జరుగుతన్నాయని ఆర్టీఏ అధికారులు, ట్రాఫిక్‌ పోలీసులు క్లియర్‌ కట్‌గా చెప్తున్నారు. మరి అలాంటి స్కూల్‌, కాలేజీ యాజమాన్యాలపై చర్యలేవి? ఎప్పుడు?  ఇకనైనా  అధికారులు స్పందించి  ప్రమాదాలు జరగకుండా  కఠిన చర్యలు చేపట్టాలనే డిమాండ్‌ వ్యక్తమవుతోంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి