Telangana: పాఠాలు చెప్పేందుకు వచ్చిన వ్యక్తిని చూసి విద్యార్ధులు షాక్.. అతడెవరో తెలిస్తే ఆశ్చర్యం

సాధారణంగా సర్పంచ్ అంటే గ్రామాభివృద్ధికి సంబంధించిన పనులు చూసుకుంటారు. నిత్యం గ్రామ రాజకీయాల్లో మునిగి తేలుతుంటారు. కానీ ఈ తండా సర్పంచ్‌ది మాత్రం ఒకింత ప్రత్యేకం. గ్రామాభివృద్ధికి పాటు పడటమే కాదు.. అందరి సర్పంచులకు భిన్నంగా భావి భారత పౌరుల అభ్యున్నతికి చొరవ చూపుతున్నాడు.

Telangana: పాఠాలు చెప్పేందుకు వచ్చిన వ్యక్తిని చూసి విద్యార్ధులు షాక్.. అతడెవరో తెలిస్తే ఆశ్చర్యం
Nalgonda

Edited By:

Updated on: Mar 13, 2026 | 6:17 PM

యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం సంగ్యా తండాకు చెందిన సంతోష్ నాయక్ బీటెక్ పూర్తి చేసిన విద్యావంతుడు. తెలంగాణ ఉద్యమంలో సంతోష్ నాయక్ చురుకైన పాత్ర పోషించాడు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తండా సర్పంచ్‌గా సంతోష్ నాయక్ ఎన్నికయ్యాడు. నిత్యం తండావాసులతో మమేకమై ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడుతుండేవాడు. చదువు ద్వారానే అభివృద్ధి సాధ్యమని నమ్మిన వ్యక్తి సంతోష్ నాయక్. సంగ్యా తండాకు చెందిన 11 మంది పదో తరగతి విద్యార్థులు తుర్కపల్లి ప్రభుత్వ మోడల్ స్కూల్‌లో చదువుతున్నారు. నేటి నుంచి ప్రారంభమైన పదో తరగతి పరీక్షలకు ఈ తండా నుంచి 11 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. పదో తరగతి పరీక్షలు అనగానే విద్యార్థులు వణికిపోతున్నారు. దీంతో సంతోష్ నాయక్.. సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే టీచర్ అవతారం ఎత్తాడు.

ప్రతిరోజు సాయంత్రం 10వ తరగతి విద్యార్థులకు గణితం, ఫిజిక్స్ సబ్జెక్టులు బోధిస్తున్నాడు. విద్య అవశ్యకత, పరీక్షలకు ఏ విధంగా ప్రిపేర్ కావాలో విద్యార్థులకు మోటివేషన్ క్లాసెస్ తీసుకుంటున్నాడు. గతంలో కూడా వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న గిరిజన విద్యార్థులకు సంతోష్ నాయక్ ప్రత్యేక క్లాసులు చెప్పాడు. సర్పంచ్‌గా ఎన్నికైన.. గ్రామ పనులతోపాటు తానే నేరుగా తండాలోని పదవ తరగతి విద్యార్థులకు చదువు చెప్పే బాధ్యతనూ తీసుకున్నారు. పిల్లల్లో ఆంగ్లభాషా నైపుణ్యాలు మెరుగుపడాలని ఉచిత శిక్షణ ఇచ్చాడు. గ్రామానికి సామాజిక సేవ చేయడంలో సంతోష్ నాయక్ ఎప్పుడు ముందుండేవాడు. అయితే అందరి సర్పంచ్‌లకు భిన్నంగా టీచర్‌గా మారి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతూ, వారి అభ్యున్నతికి చొరవ చూపుతున్నాడు. గ్రామాభివృద్ధికి పాటు పడటమే కాదు.. విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ అందరి చేత సర్పంచ్ సంతోష్ నాయక్ శభాష్ అనిపించుకుంటున్నాడు.

ఇది చదవండి: రైల్వే ప్రయాణీకులు బిగ్ బంపర్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి మరో 3 రెగ్యులర్ రైళ్లు..

Follow Us