Telangana: తెలంగాణలో సరస్వతీ నది పుష్కరాలు.. ఎప్పటినుంచి అంటే..?
తెలంగాణంలో సరస్వతీ నది పుష్కరాలు నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ పుష్కరాలకు సంబంధించిన పోస్టర్, వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ను మంత్రులు ఆవిష్కరించారు. పుష్కరాలకు నిత్యం 50 వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా. ఇంతకీ.. సరస్వతీ పుష్కరాలు ఎప్పుడు, ఎక్కడ నిర్వహించబోతున్నారు?...

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలోనే.. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వేదికగా సరస్వతీ నది పుష్కరాలు నిర్వహించబోతోంది. దీనికి సంబంధించిన వెబ్ పోర్టల్, మొబైల్ యాప్‌ను ప్రారంభించి.. పోస్టర్‌ను ఆవిష్కరించారు మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్‌బాబు. సరస్వతీ పుష్కరాలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. గత ప్రభుత్వం యాదగిరిగుట్ట మినహా మిగతా దేవాలయాలను నిర్లక్ష్యం చేసిందని.. తమ ప్రభుత్వం వచ్చాక అన్ని ఆలయాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు మంత్రి కొండా సురేఖ.
ఆలయాల దగ్గర భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. దానిలో భాగంగానే.. మే 15 నుంచి 26 వరకు సరస్వతి పుష్కరాలను నిర్వహిస్తున్నామన్నారు. 35 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామని వెల్లడించారు. అలాగే.. కాళేశ్వరంలో 17 అడుగుల సరస్వతి ఏకశిలా విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 12 రోజులపాటు కాశీ నుంచి వచ్చే పండితులతో ప్రత్యేక హోమాలు, హారతులు నిర్వహిస్తామన్నారు మంత్రి కొండా సురేఖ. తెలంగాణలో కాళేశ్వరం త్రివేణి సంగమం అన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. గోదావరి, ప్రాణహితతో కలిసి సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తుందని చెప్పారు. 2013లో తమ హాయంలోనే సరస్వతీ పుష్కరాలు జరిగాయని.. ఇప్పుడు మరోసారి నిర్వహిస్తుండడం ఆనందంగా ఉందన్నారు. ఈ పుష్కరాలకు మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛతీస్‌గడ్ నుంచి భక్తులు తరలివస్తారన్నారు. భక్తుల కోసం వంద పడకల టెంట్ సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…