సికింద్రాబాద్‌లో రూ. 60 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం..19 ఏళ్ల యువకుడు అరెస్ట్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రూ. 60 లక్షల విలువైన నకిలీ కరెన్సీ నోట్లను తరలిస్తున్న 19 ఏళ్ల యువకుడిని రైల్వే పోలీస్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది అరెస్ట్ చేశారు. నిందితుడిని రాజస్థాన్‌లోని బికానెర్ జిల్లాకు చెందిన శివరాజన్ మహీయగా గుర్తించారు. రూ. 500 విలువ కలిగిన 12 నకిలీ నోట్ల కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన ఓం ప్రకాష్ అనే వ్యక్తి ఈ కరెన్సీని జైపూర్ నుండి ముంబైకి చేరవేసేందుకు నిందితుడికి రూ. 2 లక్షలు ఇస్తానని ఆశ చూపాడు. అక్టోబర్ 30న హైదరాబాద్ చేరుకున్న నిందితుడు, ముంబై ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ రైలు సాధారణ బోగీలో ప్రయాణిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీగా నకిలీ కరెన్సీ చలామణిని రైల్వే పోలీసులు భగ్నం చేశారు. సుమారు రూ. 60 లక్షల ముఖ విలువ కలిగిన నకిలీ నోట్లను అక్రమంగా రవాణా చేస్తున్న 19 సంవత్సరాల యువకుడిని తెలంగాణ రైల్వే పోలీస్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌లోని బికానెర్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల శివరాజన్ మహీయ ముంబై ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 18519) జనరల్ కాంపార్ట్‌మెంట్‌లో ప్రయాణిస్తుండగా మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా రూ. 500 నోట్లు12 కట్టల నకిలీ నోట్లు బయటపడ్డాయి. వీటన్నింటి మొత్తం విలువ రూ. 60 లక్షలుగా అధికారులు నిర్ధారించారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొద్ది నెలల క్రితం శివరాజన్ మహీయకు బికానెర్‌కే చెందిన 25 ఏళ్ల ఓం ప్రకాష్‌తో పరిచయం ఏర్పడింది. నకిలీ కరెన్సీ బ్యాగును జైపూర్ నుంచి ముంబైకి సురక్షితంగా చేరిస్తే రూ. 2 లక్షల కమిషన్ ఇస్తానని ఓం ప్రకాష్ ఆశ చూపాడు.
ఈ క్రమంలో అక్టోబర్ 28న జైపూర్ రైల్వే స్టేషన్‌లో నకిలీ నోట్లు ఉన్న బ్యాగును శివరాజన్‌కు అందించిన ఓం ప్రకాష్, మొదట కాచిగూడకు చేరుకుని, అక్కడ నుండి ముంబై వెళ్లాలని సూచించాడు. అక్టోబర్ 30న మైసూర్ ఎక్స్‌ప్రెస్‌లో కాచిగూడ చేరుకున్న నిందితుడు ఒక లాడ్జిలో బస చేశాడు. వరదల కారణంగా కొణార్క్ ఎక్స్‌ప్రెస్ రద్దు కావడంతో, ఓం ప్రకాష్ సూచన మేరకు ముంబై ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు.
రైల్వే పోలీసుల సమగ్ర తనిఖీల్లో ఈ అక్రమ రవాణా బయటపడింది. నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ ముఠా వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి ఓం ప్రకాష్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ నకిలీ నోట్ల నెట్‌వర్క్ ఎక్కడి నుండి నడుస్తోంది, దేశవ్యాప్తంగా దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విస్తృత దర్యాప్తు చేస్తున్నారు.




