కరెంటు బిల్లు వెయ్యి, రెండు వేలు వస్తేనే.. గుండె గుభేల్ అంటుంది మధ్యతరగతివారికి. అంతలా ఏం వాడాం.. ఏసీ లేదు.. వాషింగ్ మెషీన్ లేదు.. కానీ మీటరు అలా ఎలా చూపిస్తుందని మాములు పరేషాన్ ఉండదు. బిల్లు కొద్దిగా ఎక్కువ వస్తేనే.. చాలా పొదుపు చర్యలు పాటిస్తుంటారు మిడిల్ క్లాస్ వాళ్లు. అలాంటిది ఒక్కసారి లక్షా నలభై ఏడు వేల కరెంటు బిల్లొస్తే ఎట్లుంటది…? గుండాగినంత పనైద్ది. అదే వ్యధ ఈయనది.
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కొమ్మెర అనే ఊర్లో నివశించే సంపత్ అనే వ్యక్తి.. 8 సంవత్సరాల క్రితం ఇంట్లో కరెంట్ మీటర్ పెట్టించాడు. అయితే అప్పటి నుంచి అతనికి కరెంట్ బిల్లు మాత్రం కొట్టడం లేదు కరెంట్ ఆఫీసోళ్లు. అందరికీ కొట్టి.. నా ఇంటికి బిల్లు కొట్టకుండా పోతారేంటి అని చాలా చాలాసార్లు వాళ్లు కనిపిస్తే కూడా అడిగాడట. కానీ వాళ్లు పెద్దగా పట్టించుకోలే. నీ మీటరేదో ప్రాబ్లం ఉంది బిల్ రావడం లేదని చెప్పి.. వాళ్ల పని వాళ్లు చూసుకునేవాళ్లట.. ఇటీవల విజిలెన్స్ వాళ్లు.. వచ్చి ఊరంతా చెకింగు చేస్తుంటే వాళ్లకు పోయి విషయం చెప్పాడట సంపత్. వాళ్లు అక్కడికి పోయి.. మీటర్ చెక్ చేసి.. 8 ఏళ్ల రీడింగ్ ఒకేసారి తీశారట.. ఆ బిల్లు చూస్తే.. అక్షరాలా లక్షా నలభై ఏడువేల రెండువందల ఇరవై రెండు రూపాయలు ఉందట. ఆ బిల్లు తీసి అధికారులు అతని చేతిలో పెట్టారట.
ఏంది సారు లక్ష నలభై ఏడు వేల బిల్లా.. నేనెక్కడ కట్టగలను అని అతను కళ్ల వెంట నీళ్లు పెట్టుకున్నాడట. ఎమ్మెల్యే చుట్టూ తిరిగినా..కరెంటు ఆపీసర్ల చుట్టు తిరిగినా ఎవరూ పట్టించుకోలే..ఇప్పుడొచ్చి ఇంత బిల్లు ఒక్కసారే కట్టమంటే.. కరెంటు కనెక్షన్ కటింగు చేస్కోని పోతే.. కూలీ పని చేసుకునేటోడ్ని నేనెట్ల బతకాలా అని సంపత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీంతో అతని పరిస్థితి అర్థం చేసుకున్న అధికారులు.. వాయిదా పద్దతిలో బిల్ చేసే వెసులుబాటు కల్పించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..