
ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సాధికారతకు సంబంధించి కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రంలోని 67 లక్షల మహిళా సంఘాలకు ఇప్పటికే రూ.16 వేల కోట్ల రుణాలు అందించామని, వారి ఉత్పత్తులను అమెజాన్ ద్వారా ప్రపంచ మార్కెట్‌కు అనుసంధానిస్తామని తెలిపారు. 2034 నాటికి తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఫక్కీ వేధికగా సీఎం రేవంత్ మహిళ సంఘాలకు పలు కీలక హామీలు ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..
మహిళా స్వయం సహాయక సంఘాలను కార్పొరేట్ స్థాయిలో బలోపేతం చేసేందుకు రాష్ట్రంలోని 22 జిల్లా కేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలను నిర్మిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఇవి మహిళలకు వ్యాపార శిక్షణ, మార్కెటింగ్ కార్యకలాపాలకు కేంద్రాలుగా మారుతాయన్నారు. అలాగే, శిల్పారామం సమీపంలో రూ.1,000 కోట్ల విలువైన అత్యంత ఖరీదైన స్థలాన్ని ఇందిరా మహిళా శక్తి బజార్ కోసం కేటాయించామని, ఇక్కడ గ్రామీణ హస్తకళలు, సంప్రదాయ ఉత్పత్తుల విక్రయానికి 150కి పైగా దుకాణాలు విజయవంతంగా నడుస్తున్నాయని వెల్లడించారు.
రాష్ట్ర అభివృద్ధిలో ఫిక్కీ భాగస్వామ్యాన్ని పెంచేందుకు శిల్పారామం పక్కన ప్రధాన కార్యాలయ నిర్మాణం కోసం వెయ్యి గజాల స్థలాన్ని, అలాగే ప్రతిష్టాత్మక భారత్ ఫ్యూచర్ సిటీలో మరో ఎకరం స్థలాన్ని కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు. మహిళా పారిశ్రామికవేత్తల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రతి మూడు నెలలకు ఒకసారి (త్రైమాసిక) ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తానని స్పష్టం చేశారు.
మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణాల కోసం ప్రభుత్వం ఇప్పటివరకు రూ.11 వేల కోట్లు చెల్లించిందని, ఇది కేవలం ఉచిత ప్రయాణం కాదని, మహిళల ఆత్మగౌరవ ప్రతీక అని సీఎం అభివర్ణించారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాలకు 1,000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి బాధ్యతలతో పాటు, ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ, విద్యార్థుల యూనిఫారాల కుట్టింపు బాధ్యతలను కూడా అప్పగించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 67 లక్షల మహిళా సంఘాలకు ఇప్పటికే రూ.16 వేల కోట్ల రుణాలు అందించామని చెప్పారు.
భారత్ ఫ్యూచర్ సిటీలోకి అమెజాన్ వంటి దిగ్గజ సంస్థ భారీ పెట్టుబడులతో రాబోతోందని సీఎం వెల్లడించారు. ఈ క్రమంలోనే మహిళా సంఘాల ఉత్పత్తులను అమెజాన్ వేదికగా ప్రపంచవ్యాప్తంగా విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమని, దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 5 శాతం నుండి 10 శాతానికి పెంచేందుకు మహిళా శక్తి ఎంతగానో తోడ్పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.