AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సివిల్‌ సర్వెంట్ల కొరతపై రేవంత్ సర్కార్ ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ ఏంటి..? ఆ ఐఏఎస్‌ల నిర్ణయంపై ఉత్కంఠ..

తెలంగాణ రాష్ట్రాన్ని సివిల్‌ సర్వెంట్ల కొరత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పుడే కాదూ... రాష్ట్ర విభజన టైమ్‌ నుంచి ఐఏఎస్‌, ఐపీఎస్‌ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రిటైర్డ్‌ ఆఫీసర్లను సైతం కొనసాగించాల్సి వస్తోందంటే సిచ్యువేషనల్‌ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అసలు రాష్ట్రానికి ఎందుకీ సమస్య...? గత బీఆర్ఎస్ ప్రభుత్వం సివిల్‌ సర్వెంట్ల కొరతపై ఏం చేసింది...? ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏం చేయబోతోంది...?

Telangana: సివిల్‌ సర్వెంట్ల కొరతపై రేవంత్ సర్కార్ ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ ఏంటి..? ఆ ఐఏఎస్‌ల నిర్ణయంపై ఉత్కంఠ..
Telangana Govt IAS Officers
Shaik Madar Saheb
|

Updated on: Oct 16, 2024 | 11:03 AM

Share

తెలంగాణలో అసలే సివిల్‌ సర్వెంట్ల కొరత కంటిన్యూ అవుతుంటే… పలువురిని ఏపీకి రిలీవ్‌ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. సరిపడా అధికారులు లేక రిటైర్డ్‌ ఉద్యోగులను కొనసాగిస్తుంటే… కేంద్రం నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకింత షాక్‌కు గురిచేసింది. ఇటు సివిల్‌ సర్వెంట్లు.. అటు DOPT మధ్య నలిగిపోతోంది తెలంగాణ సర్కార్. అసలే సివిల్ సర్వెంట్ల కొరత ఉందని కేంద్రానికి పదే పదే విజ్ఞప్తి చేస్తూ వస్తుంటే.. పలువురిని రీలీవ్‌ చేయాల్సిందిగా ఆర్డర్స్‌ పాస్‌ చేయడం చర్చనీయాంశమైంది.

తెలంగాణ ఆవిర్భవించి పదేళ్లు గడిచినా రాష్ట్రాన్ని ఇంకా సివిల్‌ సర్వెంట్ల కొరత వేధిస్తోంది. రాష్ట్ర విభజన టైమ్‌లో 208 మంది ఐఏఎస్‌లు, 119 మంది ఐపీఎస్‌లను మాత్రమే కేటాయించారు. దీంతో ఉన్న ఐఏఎస్‌లకే అదనపు బాధ్యతలు అప్పగించడం లేదా నాన్‌ ఐఏఎస్‌లతో నెట్టుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కీలక ప్రభుత్వ శాఖల కార్యదర్శులుగా వ్యవహరిస్తున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల్లో చాలా మంది రెండు, మూడు శాఖల చూస్తున్నారు. తమ సొంత శాఖలో కింది స్థాయి అధికారులు, సిబ్బందికే సమయం కేటాయించలేకపోతున్నారు.

గతంలో రాష్ట్రంలో ఉన్న 10 జిల్లాలను పునర్వ్యవస్థీకరణలో భాగంగా 33 జిల్లాలకు పెంచడంతో ఐఏఎస్‌, ఐపీఎస్‌ల అవసరం మరింత పెరిగింది. జిల్లాలు చిన్నవి అయినప్పటికీ ఆయా జిల్లాల్లో పరిపాలనను గాడినపెట్టడంతోపాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత సివిల్‌ సర్వెంట్లదే కావడంతో… వారి స్ట్రెంత్‌ను పెంచాలంటూ గతంలో ఉన్న బీఆర్ఎస్‌ ప్రభుత్వం కేంద్రాన్ని పలుమార్లు కోరింది.

గత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌లను పెంచాలంటూ కేంద్ర ప్రభుత్వానికి పదేపదే విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకి మాత్రమే కాదు ప్రధాని మోదీకి సైతం వినతిపత్రాలు అందజేశారు. పలుసార్లు భేటీ అయి… ఐపీఎస్ అధికారుల క్యాడర్ స్ట్రెంత్‌ను 195కి పెంచాలని కోరారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.

ఇక ఇప్పుడు తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ కేడర్‌ అధికారులను వెంటనే తమ రాష్ట్రాలకు వెళ్లిపోవాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేయడంతో ప్రభుత్వానికి తలనొప్పి మొదలైంది. ఈ క్రమంలో ఐఏఎస్‌లను రిలీవింగ్‌ చేయాల్సి వస్తే.. ఆ స్థానాల్లో ఎవర్ని నియమించాలన్న దానిపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

ఏపీకి వెళ్లాల్సిన IAS అధికారుల నిర్ణయంపై ఉత్కంఠ..

కాగా.. తెలంగాణ నుంచి నలుగురు ఐఏఎస్‌లు రిలీవ్ కావాల్సింది ఉంది. ఏపీకి చెందిన ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణిప్రసాద్, రోనాల్డ్ రాస్ తెలంగాణలో విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా ఏపీకి వెళ్లాలన్న డీఓపీటీ ఆదేశాల నేపథ్యంలో IAS అధికారులు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్- క్యాట్‌ను ఆశ్రయించారు. అయితే అక్కడ కూడా వారికి ఊరట లభించలేదు. ఏపీకి వెళ్లాల్సిందే అంటూ క్యాట్ తీర్పునిచ్చింది. IASలు ఇవాళే ఏపీలో రిపోర్ట్ చేయాల్సి ఉంది. వీరంతా వెళ్తారా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సృజన, హరికిరణ్‌, శివశంకర్.. ఈ IAS అధికారులు ఏపీ నుంచి రిలీవ్ కావాల్సి ఉంది.

అయితే.. వీరంతా ఈవాళ హైకోర్టులో పిటీషన్ వేయనున్నారు. క్యాట్‌ తీర్పుపై ఇవాళ హైకోర్టులో ఐఏఎస్‌లు లంచ్‌ మోషన్‌ పిటీషన్ దాఖలు చేయనున్నారు. క్యాట్‌ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదంటున్న IAS అధికారులు.. డీవోపీటీ ఫైనల్‌ కాదు కోర్టుకు వెళ్లే హక్కు ఉందంటున్నారు ఐఏఎస్‌ల కౌన్సిల్ అడ్వొకేట్లు.. అయితే. హైకోర్లు ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడిస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..