
తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 9 జిల్లాలకు ఆరెంజ్, 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో 20 సెంటిమీటర్లకుపైగా వర్షపాతం నమోదవుతుందని వాతావరణశాఖ తెలిపింది. కరీంనగర్, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవడంతో పాటు.. గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. కుండపోత వర్షాలతో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. ఏజెన్సీలో వాగులు, వంకలు పొంగుతున్నాయ్.
ఇక బుధవారం రాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కుమ్మేసిన వర్షంతో సిటీ జలమయమైంది. నగరంలోని కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, హైదర్‌నగర్, హఫీజ్‌పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, మియాపూర్, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, బేగంపేట, పంజాగుట్ట, అల్వాల్, సరూర్‌నగర్ దిల్‍సుఖ్‍నగర్, హయాత్‌నగర్ ప్రాంతాల్లో వర్షం కురిసింది.
మరోవైపు ఏపీలో గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాబోయే 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో వచ్చే రెండు రోజుల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు.. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు,కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం సాయంత్రం 5 గంటల నాటికి శ్రీకాకుళం జిల్లా కంచిలిలో 69మిమీ, నర్సన్నపేటలో 62.5మిమీ, కోటబొమ్మాళిలో 53.2మిమీ, మందసలో 48.7మిమీ, రాజాపురంలో 46.2మిమీ, వజ్రపుకొత్తూరులో 40.7మిమీ వర్షపాతం ననమోదైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..